రెవిన్యూ పట్టాలిచ్చిర్రు,ఇరిగేషన్ వెళ్ళిపొమ్మంటుర్రు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన డిజిటల్ పాస్ పుస్తకాలు ఉండి,రైతుబంధు కూడా తీసుకుంటున్న భూములను ప్రభుత్వ పథకాల పేరుతో ఇరిగేషన్,రెవిన్యూ అధికారులు పోలీసుల సహయంతో గుంజుకునే ప్రయత్నం చేయగా వారిని బాధిత రైతులు అడ్డుకున్న సంఘటన పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో ఉద్రికతలకు దారితీసింది.వివరాల్లోకి వెళితే దోసపహాడ్ గ్రామానికి చెందిన భూమిలేని నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ భూములను పంచి, పట్టాలు మంజూరు చేసి పూర్తి హక్కులు కల్పించాయి.

 Revenue Pattalichirru, Irrigation Vellipommanturru-TeluguStop.com

అప్పటి నుండి ఆ భూమిలో పేదలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ భూములకు డిజిటల్ పాస్ పుస్తకాలు కూడా మంజూరు చేసి,రైతుబంధు కూడా అందిస్తుంది.

కానీ,ఇప్పుడు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న హరితహారం పేరుతో అధికారులు ఆ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం భారీ పోలీస్ బందోబస్తుతో ఇరిగేషన్,రెవిన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని మీరు ఖాళీ చేసి వెళ్లాలని భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా బాధిత పేదలు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా బాధిత పేదలు మాట్లాడుతూ తమ భూములను ఇరిగేషన్ భూములంటూ అధికారులు బెదిరిస్తున్నారని,ఎన్నో ఏళ్లుగా ఆ భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామని అన్నారు.ఇప్పుడు ప్రభుత్వ పథకాల పేరుతో మా నోటికాడి కూడును కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.

తమను వెళ్లగొట్టి,అందులో హరితహారం మొక్కలు నాటాలని అధికారులు చూస్తున్నారని,ఆ భూములను ఆడ పిల్లల పెళ్లిళ్లు చేసి వారికి పసుపు కుంకుమ కింద ఇచ్చామని, భూములు లాక్కుంటే ఆడ పిల్లలు బ్రతుకులు బజారులో పడతాయని ఆవేదన చెందుతున్నారు.నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు పండే తమ భూములను తీసుకుంటే జీవనాధారం కోల్పోయి,కుటుంబాలకు కుటుంబాలు సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని వాపోతున్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన భూ సంస్కరణల ద్వారా తమ భూములకు సంబంధించి డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు కూడా వచ్చాయని,రైతు బంధు డబ్బులు వస్తున్నాయని తెలిపారు.ఆనాడు తమకు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులే,ఇప్పుడు అవి ఇరిగేషన్ భూములంటూ లాక్కోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని,చివరికి చావనైనా చేస్తాం కానీ, భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే,జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తమపై జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తగు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఉన్నతాధికారులు స్పందించి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని నిలిపి వేయాలని కోరుతున్నారు.

తహశీల్దార్ వివరణ:ఇదే విషయమై స్థానిక తహశీల్దార్ ను వివరణ కోరగా ఈ విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నాం.ఏదైనా ఉంటే వారిని అడగండి అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.

ఆర్డీవో వివరణ:దోసపహాడ్ గ్రామంలోని ఎన్.ఎస్.పి.కెనాల్ భూములలో హరితహారం మొక్కలు నాటేందుకు స్థల పరిశీలన కోసం అధికారులు వెళ్ళారు.ఆ భూముల్లో గత 30 ఏళ్లుగా సాగులో ఉంటున్న రైతులు అడ్డుకున్నారు.

కానీ,ఆ భూములు ఎన్.ఎస్.పి.కెనాల్ కోసం సేకరించినవి,దానికి సంబంధించి అవార్డు కూడా అయింది.ఆ భూములకు తెలియకుండా పట్టాలు జారీ చేసి ఉంటే క్యాన్సిల్ చేస్తారు.జిల్లాలో పచ్చదనం పెంచాలని కలెక్టర్ ఆదేశాలతో ఎన్.ఎస్.పి.,ఎస్సారెస్పీ కెనాల్ భూములను గుర్తించడం జరిగింది.దేనికి సంబంధించి నివేదిక తయారు చేసి కలెక్టర్ కు పంపిస్తాం.

ఇరిగేషన్ ఏఈ వివరణ:దోసపహాడ్ ఎన్.ఎస్.పి.కెనాల్ భూములలో హరితహారం మొక్కలు నాటేందుకు ఫీల్డ్ మీదకు వెళ్ళాం.ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులు మమ్ములను అడ్డగించారు.కానీ,అవి ఎన్.ఎస్.పి.కెనాల్ కు సంబంధించిన భూములే.వారికి పట్టాలయ్యాయి.

కొన్ని చేతులు కూడా మారాయి,దీనికి సంబంధించిన తదుపరి చర్యలు ఉన్నతాధికారులు తీసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube