సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అన్నారు.
మహాప్రస్థాన పాదయాత్ర కోదాడ నియోజకవర్గంలో పూర్తి చేసుకొని శనివారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం తంగెళ్ళగూడెం గ్రామానికి చేరుకున్న ఆమెకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే మోసమే చేశాడని,ప్రజలకు భవిష్యత్ లేకుండా చేశాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేసీఅర్ కుటుంబం కోసం,ఆయన బిడ్డల కోసమే ముఖ్యమంత్రి అయ్యాడని,కేసీఆర్ ఆయన కుటుంబం ఆయన పార్టీ తప్పితే రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని,పదవులన్ని కేసీఆర్ కుటుంబానికే ఇచ్చుకున్నాడని ధ్వజమెత్తారు.
పదవులు,ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికి ఉంటే మరి ప్రజల సంగతి ఎంటని ప్రశ్నించారు.కేసీఆర్ ప్రజల కోసం ముఖ్యమంత్రిగా లేరనేది నిజమని చెప్పారు.
రాష్ట్రంలో పోలీసులను పనోల్లలా వాడుకుంటున్నారని,భూముల కబ్జాలకు అంతు లేదని,ఏ దందా అయినా టీఆర్ఎస్ పార్టీ నాయకులే చేస్తున్నారని ఆరోపించారు.కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఉండి కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మనకు ఎందుకన్నారు.
కేసీఆర్ ఎప్పుడు వచ్చినా ఓట్ల కోసమే వస్తాడని, వస్తాడు ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతాడని ఎద్దేవా చేశారు.మీకోసం నిలబడే వారికి ఓటు వేయండని, ఆకాశంలో చందమామ తీసుకొస్తానని అంటాడని, ఎస్టీ బంధు,బీసీ బంధు అంటాడని,కేసీఆర్ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ సర్వనాశనం అవుతుందని తెలిపారు.
వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పని చేస్తుందని, వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్న వైఎస్సార్ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తా,వైఎస్సార్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అద్భుత పాలన అందించారని, వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వైఎస్సార్ ఉన్నాడని, వైఎస్సార్ జెండాలో వైఎస్సార్ ఉన్నాడని,వైఎస్సార్ తెలంగాణ పార్టీ మీ పార్టీ అని,రాజన్న పాలన మళ్ళీ తీసుకువచ్చే పార్టీ అన్నారు.వ్యవసాయాన్ని పండుగ చేస్తానని,మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తానని, మహిళా పేరు మీద పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఇస్తానని,ఆరోగ్య శ్రీ,ఫీజు రీయింబర్స్మెంట్ కు పునర్ వైభవం తెస్తానని,ఉద్యోగాల కల్పన మీద తొలి సంతకం పెడతానని,ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ కూడా ఇస్తానని ఉచిత హామీలను కురిపించారు.