సూర్యాపేట జిల్లా:వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నుంచి పట్టణ ప్రజలను రక్షించేందుకు సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దోమలపై సమరం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ప్రకటించారు.పట్టణంలోని 48 వార్డుల్లో దోమల నివారణకు ఏర్పాటు చేసిన 48 స్ప్రేయింగ్ మిషన్లను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురికి కాల్వల్లో, వీధుల్లో నీరు నిలిచి దోమల లార్వా అభివృద్ధి చెంది దోమలు పెరిగే అవకాశం ఉందన్నారు.దోమల వృద్ధిని అరికట్టి ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షించేందుకు స్ప్రెయింగ్ మిషన్లతో పాటు,ఫ్యాగింగ్ మిషన్లతో దోమల మందు పిచికారి చేయనున్నట్లు తెలిపారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలను వ్యాధుల నుంచి రక్షించేందుకు మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారన్నారు.కరోనా సమయంలో సైతం మున్సిపల్ సిబ్బంది అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
ప్రతివార్డులో ప్రతిరోజు వార్డు కౌన్సిలర్ ను సంప్రదించి పారిశుద్ధ్య సిబ్బంది దోమల మందు పిచికారీ చేయాలని సూచించారు.ప్రజలు తమ ఇండ్ల ముందు నీటితొట్టిలో నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్,బండ జనార్ధన్,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, మున్సిపల్ జవాన్లు పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.