సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం బిక్కేరు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా రాజకీయ నేతల అండదండలతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను శనివారం గ్రామస్తులు అడ్డుకొని ధర్నాను చేపట్టి,ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లడుతూ అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ నుంచి అనుమతులు తీసుకొని, నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం బిక్కేరువాగు నుంచి వందల కొద్ది లారీలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అన్నారు.
ఏలాంటి అనుమతులు లేకుండానే బిక్కురు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేయడం వలన భూగర్భ జలాలు అడుగంటి,బోర్లు మూతపడి తమ పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని వాపోయారు.రాత్రిపగలు తేడా లేకుండా నిత్యం వచ్చిపోయే ఇసుక లారీల వలన గ్రామస్తులు ఆ రోడ్డుపైన ప్రయాణించడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వే బిల్లులు లేకుండా జీరో దందాతో 50-60 టన్నుల అధిక లోడుతో ప్రయాణిస్తున్న ఇసుక లారీల వలన రోడ్డు బీటలు వారి గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని,లారీల రవాణా వలన గ్రామంలో శుభకార్యాలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని,బంధువులు ఊళ్ళోకి రావాలంటే జంకుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పేరబోయిన పెద్ద ఉప్పలయ్య,అవిలయ్య, కంచుగట్ల లింగయ్య, అనిల్,మహేందర్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.