సూర్యాపేట జిల్లా:ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని సూర్యాపేట శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన సముదాయంలో రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన ప్రజలకు మంత్రి సిఫార్స్ ద్వారా వచ్చిన సిఎం సహాయనిధి చెక్కులను సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 335 మంది లబ్ధిదారులకు కోటీ 45లక్షల రూపాయల చెక్ లను బుధవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పేద,మధ్యతరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందన్నారు.సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు.సీఎం సహాయనిధి,ఆసరా పింఛన్లు,కళ్యాణలక్ష్మి నిరుపేదల పాలిట వరంగా మారాయన్నారు.
సీఎం సహాయనిధితో పేదలు కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని అప్పుడు ఆపదలో ఉన్న వారికి అందరికీ అందేది కాదని అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.
పేదవాడి ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సిఎం కేసీఆర్ కు ప్రజలు తోడుగా వుండాలని కోరారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ఎంపిపి,జడ్పీటిసిలు,సర్పంచ్ లు ఎంపిటిసిలు,గ్రామ,వార్డు అధ్యక్షులు,వార్డ్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.