సూర్యాపేట జిల్లా:మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందాలని సంబంధిత ఇంజనీర్లు,అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ నందు మిషన్ భగీరథ త్రాగు నీటి సౌలభ్యత,సత్వరం చేపట్టవలసిన పనులపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు త్రాగునీటి ఇబ్బందులు పడకుండా చేపట్టవలసిన పనులను ఇంజనీరులు ఆయా గుత్తేదారులతో సత్వరమే పనులను పూర్తి చేయించాలని సూచించారు.
ముఖ్యoగా గ్రామాలకు వెళ్లే మిషన్ భగీరథ త్రాగునీరు ఇతర అవసరాలకు వినియోగించకుండ ఆదిశగా ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు.ఆత్మకూర్(ఎస్),పెన్ పహాడ్,చివ్వెంల,సూర్యాపేట మండలాలలో ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తులు,సంపులు నిర్మాణం,గేట్ వాల్స్ ఏర్పాటు,నీటి సౌలభ్యతపై గ్రామాల వారీగా పలు పనులపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ వేసవిలో త్రాగునీటి సౌలభ్యతపై ప్రజల నుండి ఎలాంటి వ్యతిరేకత వచ్చినా సంబంధిత అధికారులు, గుత్తేదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ నాలుగు మండలాలలో చూపించిన అత్యవసర పనులను వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
పైప్ లైన్ మరమ్మతుల కారణంగా కొన్ని అవాసాలకు గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల ద్వారా త్రాగునీరు అందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే పైప్ లైన్ వెళ్లని గ్రామాలలో సత్వరమే చేతి పంపులను మరమ్మత్తులు చేపట్టి త్రాగునీటి వసతి కల్పించాలని సూచించారు.మండల స్థాయి అధికారులు ఆయా మండలాల్లో తరుచుగా సమావేశాలు చేపట్టి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.
ముందుగా నాలుగు మండలాలలో మిషన్ భగీరథ పనులను త్వరలో తనిఖీలు చేయడం జరుగుతుందని,ముందుగా చేపట్టిన పనులలో మార్పు కనబడాలని సూచించారు.రోళ్లబండతండా,పిల్లల జగ్గూ తండా,ఇమాంపేట గ్రామాల్లో చేపట్టవలసిన అత్యవసర పనుల పరిశీలకు ఆర్డీవో,ఎంపిఓ,ఏఈ వెంటనే వెళ్లి పనుల పరిశీలన అనంతరం సత్వర చర్యలు చేపట్టి నివేదికలు అందచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ రాజేంద్రకుమార్,ఈఈ ఇంట్రా పాపారావు,డివిజనల్ పిఓ లక్ష్మీనారాయణ,తహసీల్దార్ వెంకన్న,ఎంపిఓలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.