సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణం బస్టాండ్ సమీపంలోని హుజూర్ నగర్ వైపు వెళ్ళే ప్రధాన రహదారి వెంట విద్యుత్ స్తంభం కింద ఏపుగా పెరిగిన చెట్లు విద్యుత్ తీగలకు అలుముకుని ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.చెట్లకొమ్మలు విద్యుత్ తీగలను అల్లుకొని పూర్తిగా కమ్మేయడంతో ప్రజలు ఎవరైనా చెట్టు కిందికి వెళితే ఆ చెట్టుకు విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.
నిత్యం విద్యుత్ అధికారులు ప్రధాన రహదారి వెంట వెళుతూ చూస్తూ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోతున్నారు.ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగక ముందే విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.