నల్లగొండ జిల్లా:ఆరు గ్యారంటీల హమీలపై కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు,నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి నల్లగొండలో మూడు రోజుల క్రితం కులగణనకు సంబంధించిన సమావేశంలో నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం,బత్తుల లక్ష్మారెడ్డి హాజరైన సమావేశంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రభుత్వంపై కార్యకర్తలలో వ్యతిరేకత పుట్టుకొస్తుందని కుండ బద్దలు కొట్టిన ఈ వీడియోజిల్లాలో సంచలనంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలన్నా, ఎమ్మెల్యేలను గెలిపించాలన్నా కార్యకర్తలతోనే సాధ్యమన్నారు.వేగంగా ఒక అడుగు ముందుకేసి నికార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదనే అభద్రతా భావంతో ఉన్నారని చెప్పకనే బహిరంగంగా చెప్పుకొచ్చారు.
మా బాధలు,మా కార్యకర్తల బాధలు చెప్పుకోవడానికి వేదికలు దొరకవు.ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యేలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
కాంగ్రెస్ పార్టీ చాలా స్తబ్దంగా ఉందని దీనికి కారణం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు సక్రమంగా అమలు కాకపోవడమేనని వారు వెలిబుచ్చిన మాటలకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చప్పట్లతో మారుమోగించారు.ఉచిత కరెంటు సక్రమంగా అమలు అవుతలేదని, గ్యాస్ సబ్సిడికి సంబంధించిన డబ్బులు పడతలేవని చెప్పాడు.4000 పెన్షన్ ఎందుకు ఇవ్వడంలేదని కార్యకర్తలు అడుగుతున్నారు.? ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు.ఇది మనకు మన ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఏలాంటి శషబిషలు లేకుండా ఒక మంత్రి ప్రధాన అనుచరుడిగా,కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా తన ఆవేదన వెలిబుచ్చాడు.వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని హమీ ఇచ్చాము.
ఇంతవరకు అది అతిగతి లేదన్నాడు.నెల రోజుల నుండి రైతులు తెచ్చిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు.
రైతుల బాధలను మనం డిస్కస్ చేసుకోవాలిసిన అవసరం ఉందని రైతు పక్షపాతిగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.గత కేసీఆర్ ప్రభుత్వంలో వరి పంట అమ్మిన వారం రోజులకే డబ్బులు పడేవని పది రోజులు అవుతున్నా డబ్బులు పడడం లేదని ప్రజా ఆకాంక్షలను వెలిబుచ్చారు.
సివిల్ సప్లై శాఖకు సంబంధించి మన మంత్రే ఉన్నప్పటికీ రైతుల బాధలు తీరడం లేదని పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.రైతుబంధు గురించి రైతు రుణమాఫీ గురించి కూడా మాట్లాడుదామని అనుకున్న కానీ,మన ప్రభుత్వం మీద మనమే ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదని కొంత వెనక్కి తగ్గానని కార్యకర్తలతో తన మనసులోని మాటను పంచుకున్నారు.
నల్లగొండ జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారు.ఈ జిల్లా నుంచి ఒక మంత్రి మొత్తంగా ఉమ్మడి జిల్లా నుండి ఇద్దరు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మీరందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆరు గ్యారంటీలు అమలు అయ్యేటట్లు కృషి చేయాలన్నారు.ఇది నేను చేస్తున్న విమర్శ కాదు.
ప్రజలలో ఉన్న ఆవేదన, బాధను మాత్రమే నేను వ్యక్తపరుస్తున్నానని స్పష్టంగా చెప్పుకొచ్చారు.ప్రజల ఆవేదనను,కాంగ్రెస్ పార్టీ హామీల అమలు తీరుపై నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కుడి భుజం ఐన గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు మొత్తానికి మొత్తంగా పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత దూసుకొచ్చిందనే భావాన్ని వ్యక్తపరిచాడు.
మాట్లాడిన ఈ వాస్తవిక అంశాలపై జిల్లా మంత్రులు,కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.! ఏది ఏమైనా ప్రజల ఆవేదననే గుమ్ముల మోహన్ రెడ్డి వ్యక్తపరిచాడని విస్తృతమైన చర్చ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది.
వారి వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం సమర్ధిస్తున్నారు.సొంత పార్టీ నేతల వ్యాఖ్యలతోనైనా కాంగ్రెస్ పార్టీ పాలన విధానాలలో కాస్తంతైనా మార్పు వస్తుందేమోనని విద్యావంతులు,మేధావులు సైతం చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు సైతం గుమ్మల ను అభినందిస్తున్నారు.