నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం నామాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యారులు సమస్యల వలయంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నామాపురంలో రెండు ప్రభుత్వ పాఠశాలను ఒకే కాంపౌండ్ లో ఉండడంతో జెడ్పీ పాఠశాలలో 90 మంది,ప్రైమరీ స్కూళ్ళో 41 మంది పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్దులు విద్యనభ్యసిస్తున్నారు.రెండు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు, మంచినీటి సదుపాయం లేదు,మరుగుదొడ్లు లేక విద్యార్థినులు బయటికి వెళ్ళాల్సిన దుస్థితి నెలకొందని,విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంలో గత,ప్రస్తుత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని,విద్యా శాఖ అధికారులకు ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్దులు నరకయాతన అనుభవిస్తున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలతో సతమతమవుతూ కూడా చదువన్నా సక్రమంగా నేర్చుకోవడానికి సరిపడా ఉపాధ్యాయులు లేరని,టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న తరుణంలో సోషల్ టీచర్ లేకపోవడంతో బోర్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలో అని దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఉన్నారని, చదువుతో పాటు విద్యార్థ జీవితంలో భాగమైన ఆటలు ఆడించే పిఈటి (పిడి) కూడా లేరని,దీనితో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వసతులు లేక, ఉపాధ్యాయులు లేకఅటు చదువుకు ఇటు ఆటలకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని, పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో సెక్యూరిటీ లేకుండా పోయిందని, ఉపాధ్యాయులు,విద్యార్దులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.ఈ విషయంపై ప్రజావాణిలో దరఖాస్తు చేసినప్పటికీ ఫలితం లేదని,పలుమార్లు మండల విద్యాశాఖ అధికారికి దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తలరాతలు మాత్రం మారడం లేదని, అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రభుత్వ పాఠశాల స్థితిగతులను మారుస్తామని చెప్పడం, పథకాల పేర్లు మార్చి నిధులు కేటాయించడం షరా మామూలేనని,కానీ, ఎక్కడా మార్పు వచ్చిన దాఖలాలు లేవని, నామాపురం పాఠశాలలే దానికి నిదర్శనమని అంటున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడుతున్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని సత్వరమే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకైచర్యలు తీసుకోవాలని విద్యార్థులు,తల్లిదండ్రులు,గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదే విషయమై ఎంఈఓను వివరణ కోరగా… పాఠశాలలో సమస్యలు ఉన్నమాట నిజమేనని,ఈ సమస్యలను మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామని, మరుగుదొడ్లు,చుట్టూ కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయ్యాయని,టీచర్ పోస్టులు కూడా అతి త్వరలో సర్దుబాటు చేస్తామని తెలిపారు
.