నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని పశు వైద్యశాలలో డాక్టర్ లేక గత మూడు నెలలుగా మూతపడి ఉందని స్థానికులు చెబుతున్నారు.పశువులకు సీజనల్ వ్యాధులు సోకితే చికిత్స చేసే దిక్కే లేదని,వేల రూపాయలు పెట్టి ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసినా పశువులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇక్కడ పనిచేసిన పశు వైద్యాధికారిని బదిలీ చేసి,వేరే వారిని ఇక్కడి బదిలీ చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని,రైతులు మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని వాపోతున్నారు.
ఆమనగల్లు పశువైద్యశాలకు లక్ష్మీదేవిగూడెం,ఎరకలగుట్ట, చలిచిమలపాలెం,తాళ్లగడ్డ పరిసర గ్రామాల నుండి పశువులను తీసుకువస్తారు.
వర్షాల సమయంలో పశువులు,గొర్రెలు,మేకలు,ఇతర జంతువులు వ్యాధుల బారిన పడుతున్నాయని, పశువులకు జబ్బు చేసి పశు వైద్య కేంద్రానికి తీసుకువస్తే తాళం వేసి ఉంటుందని,ఇదే అదునుగా భావించి కొంతమంది పశు వైద్య కేంద్రాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి పశు వైద్య కేంద్రానికి పశు వైద్య అధికారిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.