యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి రైల్వే స్టేషన్లో మీ వెహికిల్స్ పార్కింగ్ చేసి వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే…సాధారణంగా ఇంటి బయట పార్కింగ్ చేసే వాహనాల్లో కొంతమంది ఆకతాయిలు పెట్రోల్,డీజిల్ కొట్టేసిన ఘటనలు మీరు చూసే వుంటారు.కానీ,రైల్వే స్టేషన్లలో,బస్ స్టేషన్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం సర్వసాధారణం.
పార్కింగ్ కాంట్రాక్టు వారికి వెహికిల్ ను బట్టి,టైమ్ ను బట్టి ఛార్జ్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే.బయట పెడితే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని,పార్కింగ్ స్థలంలో పెట్టి వెళతాం.
కానీ,ఆ పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వారే మన వాహనాల్లో పెట్రోల్,డీజిల్ దొంగిలిస్తే…?అది కూడా కాంట్రాక్టర్ కింద పనిచేసే సిబ్బంది కాకుండా స్వయంగా కాంట్రాక్టరే పెట్రోల్ చోరీలకు పాల్పడితే…? ఇక వాహనాలకు సేఫ్టీ ఎక్కడ? ఇంతకీ ఇలాంటి సంఘటనే భువనగిరి రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసిన జి ఆర్ పి వెహికల్ లో స్టేషన్ కాంట్రాక్టర్ పెట్రోల్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు.
ఇదేంటి అడిగిన వ్యక్తితో సదరు కాంట్రాక్టర్ పెట్రోల్ తీసుకునే హక్కు తనకు ఉందని,అలాగే తీస్తామని చెప్పడం గమనార్హం.పార్కింగ్ చేసిన వెహికల్స్ లో పెట్రోల్ తీస్తూ వచ్చిపోయే ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పార్కింగ్ డబ్బులు అధికంగా వసూలు చేస్తూ ప్రయాణికుల పాలిట శనిలా తయారయ్యాడని వాహనదారులు వాపోతున్నారు.
ఎవరైనా అడిగితే తనకు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని,మీకు దిక్కున్నచోట చెప్పుకోండని అంటున్న కాంట్రాక్టర్ వ్యవహారశైలిపై విచారణ జరిపి,కాంట్రాక్ట్ రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.