యాదాద్రి జిల్లా:తెలంగాణలో ఏయే రంగాల్లో అవినీతి జరుగుతుందో ప్రధాని మోదీ అడిగినట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.సోమవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రధాని అపాయింట్మెంట్ కోరగా అరగంటలోనే వచ్చిందని,తెలంగాణ సమస్యలు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు.
మూసి నదిలో నీరు శుద్ధి చేయకుండా కిందికి వెళ్లడం వలన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,కొందరు చనిపోతున్నారని ప్రధానికి తెలిపినట్లు వివరించారు.నమామి గంగ తరహాలో మూసినది ప్రక్షాళన చేయాలని కోరినట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణంపై చర్చించామని పేర్కొన్నారు.నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయలేకపోయిందా అని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కోమటిరెడ్డి తెలిపారు.
తెలంగాణలో మైనింగ్ కుంభకోణం జరుగుతున్నదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా,చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు.ఏ రంగాల్లో అవినీతి జరుగుతున్నదో ప్రధాని అడిగి తెలుసుకున్నారని,తెలంగాణపై దృష్టి పెడతామని అన్నట్లు తెలిపారు.