నల్లగొండ జిల్లా:ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఏ గ్రూప్ లో చేర్చబడిన అభివృద్ధి చెందిన కులాలను వెంటనే తొలగించాలని బేడ బుడిగ జంగం రాష్ట్ర నాయకులు పర్వతం ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 తేదిన తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి అమోదించడం సంతోషకరమని,ఎస్సీ వర్గీకరణ సాకారమయ్యేందుకు 30 ఏళ్లుగా పోరాడిన మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ ఏ గ్రూప్ లో అత్యంత వెనకబడిన కులాలతో పాటు,అభివృద్ధి చెందిన మాల ఉప కులాలను చేర్చడం చాలా దారుణమని అన్నారు.ఎస్సీ ఏ గ్రూపులో చేర్చిన కులాలు విద్యా,వైద్య, ఆర్థిక,సామాజిక పరంగా తీవ్ర అణచివేతకు గురై అత్యంత వెనుకబడినవని,కాబట్టి
ఏ గ్రూప్ కి రిజర్వేషన్ ను 3%శాతానికి పెంచాలన్నారు.
ఇప్పటికీ పరీక్షలు జరిగి ఫలితాలు ఇవ్వాల్సిన గ్రూప్-1,2 నియామకాలలో ఎస్సీ వర్గీకరణ అమలుచేసి ఫలితాలు ప్రకటించాలని,రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లలో రోస్టర్ విధానాన్ని మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఎస్సీ ఏ గ్రూప్ కి 1000 కోట్లతో ప్రత్యేకమైన ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బేడ బుడగ జంగం వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలన్నారు.
ఎస్సీ ఏ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని, ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వ పథకాలలో బేడ బుడగ జంగం కులానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని,ఉద్యోగాల భర్తీలో ప్రిఫరెన్సిఎల్ ప్రయారిటీ విధానాన్ని తొలగించాలని,
మ్యానిపేస్టోలో ప్రకటించిన విధంగానే అంబేద్కర్ అభయ హస్తం పథకం క్రింద ప్రతి కుటుంబానికి 20 లక్షలతో స్వయం ఉపాధి కల్పించాలని కోరారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని,లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడిగ జంగం నాయకులు చెలిమెండ్ల పద్మయ్య,శిరిశాల స్వామి, బాణాల వెంకన్న,కడమంచి వెంకటయ్య,నిడిగొండ రామచంద్రు,వానరాశి నారాయణ,వెంకన్న,బొందయ్య, వేముల బుచ్చయ్య,వేముల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.