యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవన్ని కాకి లెక్కలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని, అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదన్నారు.బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్నచూపని,”మేమెంతుంటే మాకంత వాటా” అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని,ఆ ప్రకారం 46.3 శాతం బీసీలు,10 శాతం బీసీ ముస్లింలు మొత్తం కలిపి 56 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కితగ్గుతున్నారని ప్రశ్నించారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇళ్లు 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని, 2014 లో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇళ్లు,3 కోట్ల 68 లక్షల జనాభా అని తేలిందని, అప్పడు నాలుగేళ్ల వ్యవధిలో చేసిన సర్వేలోనే 20 లక్షల ఇళ్ళు పెరిగాయన్నారు.2014-2024 వరకు పదేళ్ళలో ఎన్ని ఇళ్ళు ఎంత జనాభా ఉండాలి…? ఎన్ని కుటుంబాలు పెరగాలి…?కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కుల గణనతో కోటి 15 లక్షల ఇళ్లు ఉన్నాయని చెబుతుందన్నారు.జనాభా మూడు కోట్ల 70 లక్షలని చెప్తుందని,2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇల్లు పెరిగితే 2014 నుంచి పదేళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలని,ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్లు తెలుస్తుందన్నారు.కానీ,కాంగ్రెస్ ప్రభుత్వం 46.2 శాతం ఉన్నట్లు తేల్చడం బాధాకరమన్నారు.
ఇది కరెక్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి గుండెమీద చేసుకుని చెప్పాలని, ఈ కాకి లెక్కలతో అయినా బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం తక్షణమే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి,తక్షణమే రిజర్వేషన్లను పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మొసాన్ని బీహార్,కర్నాటకలో చేసిందని, తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
సకల జనుల సర్వేకు,ఇప్పటి ఈ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తున్నదని,సకల జనుల సర్వేలో ఓసీల జనాభా చాలా తక్కవ తేలిందని,ఈ సర్వేలో చాలా ఎక్కువ కనిపిస్తోందన్నారు.దీని వెనుక మతలబు ఏమిటో ప్రభుత్వం చెప్పాలని,కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ,ఎస్టీల జనాభా తగ్గుతుందా…? సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారని,సకల జనుల సర్వే డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు,కార్యక్రమాలు నిర్వహించారన్నారు.