గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అలాగే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ప్రచారాలు జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇటు బాలకృష్ణ, ఎన్టీఆర్ ప్రవర్తన చూస్తే ఆ వార్తలు నిజమే అని నమ్మాల్సిందే.
ఇకపోతే ఈ వార్తలపై ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ లో ఎవరు స్పందించకపోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.ఆ సంగతి అటు ఉంచితే ఇటీవల ఒక సందర్భంలో నారా లోకేష్( Nara Lokesh ) జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం, తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram ) తెలుగుదేశం జెండా చేతబట్టి అభిమానులను అలరించడం చూస్తుంటే నందమూరి కుటుంబంలో విభేదాలు అన్నది వట్టి ప్రచారమే అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ఆరంభించారు.

ఆ సందర్భంగా నూజివీడు మండలం సీతారామపురంలో తెలుగుదేశం మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఆ సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు.తద్వారా తమ మధ్య విభేదాలన్నవేవీ లేవని చాటారు.
ఇది నందమూరి అభిమానుల్లో కాస్త జోష్ పెంచింది.లోకేష్ ఎన్టీఆర్ ప్లెక్సీని పట్టుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ టీడీపీ జెండా పట్టుకుని హల్ చల్ చేశారు.నరసరావు పేటలో పర్యటించిన హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా చేత పట్టుకుని సందడి చేశారు.
దీంతో టీడీపీ అభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ జోష్ అయ్యారు.

ఈ రెండు సంఘటనలు కలిపి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబానికి ఒకింత దూరం మెయిన్ టైన్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అర్థమవుతుంది.అయితే గతంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలే ఈ విభేదాల ప్రచారానికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు.గతంలో ఒకసారి నందమూరి కల్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూతో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు ఇంకే పార్టీకి మా తాత స్థాపించిన తెలుగుదేశానికే ( Telugu Desam Party ) అని చెప్పకుండా తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం.
కుటుంబ కార్యక్రమాల్లో నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పెద్దగా కనిపించకపోవడం ఈ ప్రచారానికి కారణమయ్యాయి.

అయితే పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని విస్పష్టంగా చెప్పినా ఈ ప్రచారానికి తెరపడలేదు.ఇందుకు కారణం ఈ విషయంలో బాలకృష్ణ స్పందించకపోవడమేనని అంటారు.అంతే కాకుండా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేయమంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా విభేదాల ప్రచారానికి దోహదపడ్డాయి.
అయితే ఇప్పడు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది.ఇకపోతే మే 28న ఘనంగా జరగనున్న ఎన్టీఆర్ జయంతి వేడుక వేదిక కానుంది.ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆ వేడుకకు ఆయన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఆహ్వానించనున్నారని టాక్.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగలా నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సారి కూడా మహానాడును( Mahanadu ) కడప వేదికగా నిర్వహించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు.
ఆ మహానాడుకు బాలకృష్ణ కూడా హాజరౌతారు.మరి బాలకృష్ణ నిర్వహించే కుటుంబ వేడకకు కూడా మహానాడే వేదిక అవుతుందా? మహానాడు వేదికగా జరిగే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు హాజరౌతారా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది.దీంతో ఒకే వేదికపై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు అన్నది ఒట్టి ప్రచారం మాత్రమేనని తేలిపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వదం తులకు కూడా చెక్ పడుతుందని తెలుగుదేశం, నందమూరి అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.మరి ఈ విషయంపై సరైన స్పష్టత రావాలి అంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.