నల్లగొండ జిల్లా:తెలంగాణలో అరాచక పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపడమే తన ఏకైక లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని పిఆర్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం కాదని,ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయ సాధన కోసమన్నారు.తెలంగాణలో అభివృద్ధి పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లు అప్పగించి కేసీఆర్ అనుచరులకు కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారన్నారు.
నాగార్జునసాగర్‌లో ప్రతి గ్రామానికి 25 లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ మునుగోడులో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నందున వారి గ్రామాలకు ఇవ్వడం లేదన్నారు.తెలంగాణా నీ అయ్యా జాగిరా అని,కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.
సూర్యాపేటలో మంత్రి గెలిచే దిక్కు లేదన్నారు.ఒక సర్పంచ్ పంచే చెక్కులు మంత్రి వచ్చి పంచడం సిగ్గుచేటన్నారు.
కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని,కేటీఆర్ మాత్రం తండ్రి తర్వాత తానే సీఎం అని అహంకార ధోరణి అవలంభిస్తున్నారన్నారు.రాష్ట్రంలో ఆలీబాబా దొంగల ముఠాలా కేసీఆర్ పాలన నడుస్తుందన్నారు.
బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు 100 కోట్లు నిధులు ఇస్తే పూర్తయి మునుగోడు నియోజకవర్గం ప్రజలకు సాగు తాగునీరు అందుతాయన్నారు.మునుగోడుపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నాడని,తన ఫామౌజ్ కోసం వేల కోట్లు ఖర్చులు పెట్టి కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారన్నారు.మునుగోడు నియోజకవర్గంలో ఓడిన ఎమ్మెల్యేతో ఓడిపోయే ఎమ్మెల్యే (జిల్లా మంత్రి) తిరుగుతున్నారని వారి అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.2014 ఎన్నికల ముందు మంత్రి ఆస్తి కంటే ఇప్పుడు వందల వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు.ఈటలను ఓడించేందుకు తీసుకొచ్చిన దళితబంధు మునుగోడు నియోజకవర్గంలో అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నాయకున్ని గెలిపిస్తానని హామీ ఇచ్చానని,20 వేల దళితులు ఈ నియోజకవర్గంలో ఉంటే వందమంది దళితులకే ఇచ్చి కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ ఇండ్లు,రైతు లక్ష రూపాయల రుణమాఫీ ఎక్కడని ప్రశ్నించారు.
నియోజకవర్గ ఎమ్మెల్యేకు తెలియకుండా అధికారులను బెదిరించి,నీతి,నైతిక విలువ లేకుండా మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.మునుగోడు అభివృద్ధి కోసం తన ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచానని,తన గెలుపు కోసం కృషి చేసిన మునుగోడు నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు.
మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడొద్దని,వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ,వారి సూచన మేరకే కొనసాగుతానని హామీ ఇచ్చారు.