నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామ శివారులో పిల్లిపాకుల రోడ్లు పాలవాయి పంపులో గల సర్వేనెంబర్ 121 గల చెరువుకుంటను అధికార పార్టీకి చెందిన కడారి అంజయ్య కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం రైతులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ అండతో బ్రిడ్జి పక్కన ఉన్న కుంటలో మట్టి పోసి గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేస్తున్నారన్నారు.
గత 40 ఏళ్లుగా ఈ కుంట ప్రభుత్వ కింద ఉందని,తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేపట్టిన చెరువు పండుగ కూడా ఇక్కడే చేశారని తెలిపారు.గ్రామానికి నీటి వనరు అందించేందుకు ఈ చెరువు తప్ప ఇంకో చెరువు లేదని,పశువులకు తాగు నీటికి ఇదే ఆధారమన్నారు.
ఈ చెరువులో నీరు బయటకు వెళ్లకపోతే పక్కనే ఉన్న ఇళ్లు మునిగిపోయే ప్రమాదముందని,
ఈ చెరువుకు మేదోని కుంట, సరేణి కుంట నుండి వర్షపు నీరు చేరుతుందని,మట్టి పోసి పూడ్చడం వలన పై నుండి వచ్చే వరద నీరు రాకుండా ఉంటుందని, దీనితో చుట్టుపక్కల భూముల్లో నీరు నిలిచి పంటనష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బ్రిడ్జికి చెక్ డాం కూడా ఉన్నదని అన్నారు.
అధికార పార్టీ అండతో ఇదంతా చేస్తున్నారని,అందుకే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపించారు.రైతులకు గ్రామస్తులకు నష్టం కలిగించే ఈ చర్యలను అరికట్టి,కబ్జాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై గ్రామ సర్పంచ్ శ్రీరాములు స్పందిస్తూ ఈ విషయాన్ని ఆర్డీఓ, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రైతులు కూర సాలయ్య, శీను తదితరులు పాల్గొన్నారు.