నల్లగొండ జిల్లా:మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ పెంపు (మంగళవారం) నేటి నుంచే అమల్లోకి రానున్నది.ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.దీంతో దాదాపు ఐదేండ్ల తర్వాత రాష్ట్రంలో ధరలు పెరుగనున్నాయి.
మరోవైపు ధరల పెంపు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బీర్ల కంపెనీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.
ఇటీవల జరిగిన హైడ్రామాను ఉదహరిస్తున్నారు.బీర్ల ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని యూబీ గ్రూప్ హెచ్చరించడం,ఆ తర్వాత ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీని వేయడం,ఇప్పుడు ధరలు పెంచడం వంటివన్నీ పథకం ప్రకారమే జరిగాయని ఆరోపిస్తున్నారు.
సరిగ్గా ఎండాకాలం ప్రారంభం కాగానే ధరలు పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని,సమయం చూసి దోచుకునేందుకే ప్రభుత్వం బీర్ల ధరలు పెంచిందని మండిపడుతున్నారు.