నల్లగొండ జిల్లా:డిజిటల్ మీడియా ముసుగులో సోషల్ మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న అక్రమ వ్యవహారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.ఇప్పటికే న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ (ఆర్ఎన్ఐ) అప్లికేషన్ వెబ్ సైట్ ను నిలుపుదల చేసింది.
పలు కీలక మార్పులు ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.నోటిఫికేషన్ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరింది.
ఆర్ఎన్ఐ అనుమతి మరింత కఠినతరం చేశారు.సమాచార మంత్రిత్వ శాఖ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలా ,డిజిటల్ మీడియా విభాగం నెలకొల్పడం నూతన పరిణామం.
డిజిటల్ మీడియా విభాగంలో అధికారుల నియామకం సైతం చేపట్టి ప్రక్రియ పూర్తి చేసింది.దేశవ్యాప్తంగా డిజిటల్ విభాగంలో ఇప్పటికే 61 డిజిటల్ మీడియా సంస్థలు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది.ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మొత్తంగా మూడు దరఖాస్తులు వచ్చినట్లు, అవి విచారణ దశలో ఉన్నట్లుగా సమాచారం.2021 లో కేంద్రం డిజిటల్ మీడియాకి చట్టబద్దత కల్పిస్తూ కొన్ని నియమాలను రూపొందించిన విషయం విదితమే.ఈ నియమాల ప్రకారం అడ్డగోలుగా వ్యవహరించకుండా మీడియా సంస్థలు నియంత్రణ చేసుకోవాలి.నిబంధనల అతిక్రమణ తీవ్రరూపంలో ఉంటే ఎటువంటి ఫిర్యాదు లేకుండానే స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి చర్యలు తీసుకోవచ్చు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు వర్తించే ప్రతీ నిబంధన డిజిటల్ కి కూడా వర్తిస్తుంది.కేంద్రంలోని సంబంధిత విభాగం లక్షల్లో జరిమానా,జైలుశిక్ష ప్రతిపాదన చెయ్యవచ్చు.డిజిటల్ మీడియా కార్యాలయంతో పాటు కార్య నిర్వాహకుడు కూడా భారతదేశంలోనే చిరునామా కలిగి ఉండాలి.ఆ మేరకు పూర్తి వివరాలతో బోర్డులు కలిగి ఉండాలి.
స్వీయ నియంత్రణ కమిటీ, ఫిర్యాదులకు ఫోన్ నెంబర్, ప్రతీ ఆన్లైన్ కంటెంట్ (వార్త )కి జోడించాలి.ఇలా అనేక నిబంధనలు రూపొందించారు.
ఎవరు పడితే వారు,కనీసం సరియైన చిరునామా లేని వారు,యూట్యూబర్లు కొంతమంది మాది ఛానల్, డిజిటల్ మీడియా అని ప్రకటనలు ఇవ్వడం, ఆన్లైన్లో అడ్డగోలుగా కంటెంట్ (సమాచారం) పెట్టటం చేస్తున్నారు.డిజిటల్ మీడియా పేరుతో ఇబ్బడిముబ్బడిగా సంఘాలు వెలిసాయి.
షోషల్ మీడియా పరిధిలోకి పైవన్నీ వస్తాయి.పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం కేంద్రం డిజిటల్ ఫ్లాట్ ఫాం మీడియా విభాగం ప్రవేశ పెట్టినట్లుగా తెలుస్తోంది.
కరోనా కాలం నుండి డిజిటల్ మీడియా ప్రాధాన్యత విస్తృతంగా పెరిగింది.దానిని అదనుగా భావించిన కొందరు సోషల్ మీడియా ముసుగు వేసుకొని డిజిటల్ మీడియా పేరుతో చలామణి అవుతూ జర్నలిజం స్థాయిని దిగజారుస్తున్న నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ మీడియా నిబంధనల అమలు కొంతవరకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది
.






