నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా బెల్ట్ దందా యధేచ్చగా, స్వేచ్చగా కొనసాగుతుంది.పాలకులు మారినా మద్యం అమ్మకాల పాలసీ మాత్రం ఒక్కటేనని ప్రజలు ముఖ్యంగా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రోహిబిషన్ శాఖ అంటే మద్యాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేయబడింది.కానీ,పాలకులు విధానాల మూలంగా విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహిస్తోంది.
వైన్స్ యాజమాన్యానికి టార్గెట్ పెట్టి మరీ మద్యం అమ్మకాలు చేయిస్తుంది.దీన్ని ఆసరాగా చేసుకున్న వైన్స్ యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి పల్లె పట్నం అనే తేడా లేకుండా వీధికో బెల్ట్ షాపు పెట్టించి వైన్స్ లో ఉండాల్సిన మద్యం మొత్తం ఓపెన్ గా గ్రామాలకు తరలిస్తూ ఎమ్మార్పీ కంటే రూ.30 నుండి రూ.50 వరకు అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.ఇందులో అందరి పాత్ర ఉండడంతో మీడియా,సోషల్ మీడియా ఎన్ని కథనాలు ఇచ్చినా ఎవరూ స్పందించరు.అప్పుడు అంతా ప్రభుత్వ కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి ప్రజలూ అలవాటుపడిపోయారు.
కానీ,ఇప్పుడు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మొత్తం వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ కి వస్తుంది.
ఒక్కసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( Model Code of Conduct )వచ్చాక ఇక ఎవరి పప్పులు ఉడకవని అందరికీ తెలిసిందే.
అయినా ఈ సారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు జరుగుతున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తుందని ప్రజలు వాపోతున్నారు.మామూలు సమయంలో మామూళ్ల మత్తులో ఉంటే కొందరు అధికారులు,ఎన్నికల సమయంలో కూడా అదే రీతిలో ఉండడంపై ఎన్నికల నిర్వహణ తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాలకులు అలాగే ఉండి,ఎలక్షన్ కమిషన్ అలాగే ఉంటే ఇక వ్యవస్థలను చక్కదిద్దే వారెవరూ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.సాధారణ సమయంలో బెల్ట్ దందా నడిచి,ఎలక్షన్ కోడ్ ఉండగా మరింత ఎక్కువగా నడుస్తుంటే ఇక బెల్ట్ దందా బెండ్ తీసే వారెవరూ?ఎందుకు బెల్ట్ దందాపై ఎవరూ నోరు మెదపడం లేదూ?ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎందుకు నివారణ చర్యలు తీసుకోలేక పోతున్నారు?అంటే అసలే కరువు తాండవిస్తూ ప్రజలు అల్లాడుతుంటే బెల్ట్ షాపులను ప్రోత్సహించి తాగుబోతులను చేయడానికి అందరూ కంకణం కట్టుకున్నారా?మద్యానికి బానిసలై పేదలు ఆర్ధికంగా, శారీరకంగా,ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్న పాలకులకు ఏం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా నెల రోజులు ఎన్నికల కోడ్( Election Code ) ఉంటుంది.ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
ఈ నెల రోజులు కూడా ఇలాగే కొనసాగితే ఎన్నికల కోడ్ ఉన్నా లేనట్లేనని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వీధికి రెండు బెల్ట్ షాపులు వెలసి ఎన్నికల కోడ్ ను తుంగలో తొక్కుతున్నారు.
ఇదే అదునుగా మద్యం షాపులు బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను,మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ఆరోపించారు.నిబంధనలు ఉన్నప్పటికీ గ్రామాలలో అక్రమంగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,గ్రామాల్లో మంచినీటికైనా కొరత ఉన్నదేమో గానీ,బెల్ట్ షాపుల ద్వారా మద్యం కొరత లేకుండా ఉందన్నారు.
ఇప్పటికైనా మద్య అమ్మకాలను అరికట్టి ప్రజా ఆరోగ్యాలు కాపాడాలని కోరుతున్నారు.