నల్గొండ జిల్లా:గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామంలో గొర్రెల పంపిణీ పథకం( Sheep Distribution scheme )లో అధికార పార్టీ నేతలు జొరబడి ఇష్టారాజ్యంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారని, తద్వారా గ్రామంలోకి యాదవుల మధ్య చిచ్చు పెడుతున్నారని స్థానిక యాదవులు ఆరోపిస్తున్నారు.గ్రామంలో సుమారు వంద మంది యాదవుల నుండి గొర్ల యూనిట్ల కోసం రెండు నెలల క్రితం డీడీలు కట్టించారని,కానీ,కేవలం 36 మందికే గొర్ల యూనిట్లు మంజూరు అయ్యాయని లిస్టు విడుదల చేశారని లబోదిబోమంటున్నారు.
దీనితో ముందు డీడీలు కట్టిన యాదవులు లిస్టులో తమ పేర్లు ఏవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికార పార్టీ నేతల జోక్యంతోనే జరుగుతుందని మండిపడ్డారు.
ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం గొర్ల పంపిణీ చేయకుండా, రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకొని లబ్దిదారులను ఎంపికచేయడం సబబుకాదన్నారు.
దీని వల్ల పల్లెల్లో కలిసుండే యాదవుల మధ్య చిచ్చు పెట్టడమేనని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ముందుగా డీడీలు కట్టినవారికి మొదటి జాబితాలో,ఆ తర్వాతి వారికి రెండో జాబితాలో అవకాశం ఇచ్చి పారదర్శకతను పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అందరికంటే ముందు మేమే డీడీ కట్టామని గ్రామానికి చెందిన బొమ్ము మల్లయ్య ( Mallaiah )అన్నారు.కానీ,మానాన్నకు కానీ,నాకు కానీ,గొర్ల యూనిట్ రాలేదని,చాలామందికి ఒక ఇంట్లనే ఇద్దరికి ఇచ్చిండ్రని,ఏ పద్దతిన గొర్ల యూనిట్లు ఇచ్చిర్రు అనేది అర్ధం కాట్లేదన్నారు.
కొద్ది మందికే గొర్లు ఇచ్చి మాలో మాకే పంచాయతీ పెట్టిండ్రని,ఈ పద్దతి మారాలన్నారు.