నల్గొండ జిల్లా:నాంపల్లి మండలంలోని పస్నూర్ గ్రామంలో ఇటుక బట్టీల వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి.ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా మండలంలోని పస్నూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా నిర్వహిస్తున్న మట్టి ఇటుకల వ్యాపారాన్ని అడ్డుకునే అధికారులే లేకుండా పోయారు.
దొంగచాటుగా చెరువులు,కుంటలు,శిఖం భూములలో నుండి మట్టిని తీస్తూ పట్టా భూముల నుండి మట్టిని తీస్తున్నామని చెప్పుకోవడం గమనార్హం.దీంతో ఇటుక బట్టీల నిర్వాహకులు దోపిడికి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.
అయితే దీనికి అధికారులు కూడా వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.అంతేకాకుండా పక్క రాష్ట్రాలు అయిన ఒరిస్సా,మహారాష్ట్ర,బీహార్ నుండి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీలలో పనికి వినియోగిస్తున్నారు.
లేబర్ చట్టంలో పొందుపరిచిన లింగవివక్ష లేకుండా (ఆర్టికల్39) భార్య,భర్తలకు సమాన కనీస వేతనాలు ఇవ్వడం లేదని బట్టీలలో పనిచేసే కూలీలు ఆవేదన చెందుతున్నారు.అలాగే కార్మిక చట్టం ప్రకారం 20 మంది కన్నా ఎక్కువ కూలీలతో పని చేయించినట్లయితే ఈఎస్ఐ,పీఎఫ్ తప్పనిసరి ఉండాలి.
కానీ,ఇక్కడ అలాంటివి అమలు కావడం లేదు అదేవిధంగా చిన్న పిల్లలతో పని చేయించిన కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.ఇటుక బట్టీలలో పనిచేసే కూలీలకు ఎలాంటి ప్రమాద బీమా ఇన్సూరెన్స్,హెల్త్ కార్డులు, నివాస సముదాయాలు, కరెంట్ లాంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా బాలకార్మికులతో కూడా వెట్టి చాకిరి చేయిస్తున్నారని, దీనితో తరగతి గదిలో పుస్తకాలు చదవాల్సిన బాల్యం ఇటుక బట్టీలో బందీగా మారిందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి,పిల్లలతో పని చేయిస్తున్న ఇటుక బట్టీ యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.