నల్లగొండ జిల్లా: పోలింగ్ నిర్వహణలో పిఓ,ఏపిఓ, ఒపీవోలు తప్పులు చేసినట్లయితే సస్పెండ్ తో పాటు,ఎన్నికల నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హెచ్చరించారు.శుక్రవారం దేవరకొండలోని ఎకెఆర్ డిగ్రీ కళాశాలలో పిఓ, ఏపిఓల పార్లమెంట్ ఎన్నికల 2 వ విడత శిక్షణా తరగతులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా ఇదే కళాశాలలో ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.ఎన్నికల విధుల్లోని ఉద్యోగులందరూ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
మాక్ పోల్,టెండర్ ఓటుతో పాటు,ఈవీఎం, బియు,సియు లను ఎలా అనుసంధానం చేయాలో అడిగి తెలుసుకున్నారు.మాక్ పోలింగ్ సమయం అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో చేయవలసిన విధులు,ఇతర అంశాలను శిక్షణకు హాజరైన పిఓ, ఏపిఓలను అడిగారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఇందుకు గాను నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 6 ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈనెల మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
పిఓ,ఏపిఓ,ఇతర పోలింగ్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, పోలింగ్ నిర్వహణకై ఎన్నికల సంఘం జారీ చేసిన హ్యాండ్ బుక్ ను మార్గదర్శకాలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదువుకోవాలని,ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని, పోలింగ్ ను అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ దేవరకొండ పట్టణంలోని పాత సత్యసాయి కాలేజీ రోడ్ లో 91 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్ బిఎన్ శామ్యూల్ హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోగా,వారి ఇంటి వెళ్లి ప్రత్యక్షంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు.జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు,స్థానిక తహసిల్దార్ తదితరులు ఉన్నారు.