నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం, గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన ఎరుకలగుట్ట గ్రామ భూములకు కల్వెలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని మూసి కాలువ నుండి వచ్చే నీటికి అధికారులే అడ్డుకట్ట వేసి రాకుండా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విషయం తెలిసిన రైతాంగం సోమవారం ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మూసి నీటిపై ఆధారపడి పంటలు వేసిన రైతులకు అధికారులే నీటిని రాకుండా అడ్డుకట్ట వేయడం ఏమిటని ప్రశ్నించారు.అధికారులు వెంటనే అడ్డుకట్ట తొలగించి రైతాంగానికి నీటి సరఫరా కల్పించాలని జిల్లా మంత్రులను,ఎమ్మెల్యేలను కోరారు.
గత కొద్దిరోజులుగా రెండో విడత నీళ్ళ కోసం ఎదురుచూస్తుండగా కాలువపై అడ్డుకట్ట వేసి నీళ్లు రాకుండా చేశారని,దీనితో పొలాలు తీవ్రంగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయం అధికారులను అడిగితే 35వ,డిస్ట్రిబ్యూటర్ వరకే చివర అని,అందుకే అడ్డుకట్ట వేయడం జరిగింది అంటున్నారని,దీని వల్ల తాము పూర్తిగా నష్టపోతామని వాపోయారు.
మూసి కాలువపై వేసిన అడ్డుకట్ట తొలగించి రైతాంగానికి నీటిసౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు నామ సైదులు, రైతులు ఇట్టమల్ల లక్ష్మయ్య, ఇట్టమల్ల జానీ,పల్లా సుధాకర్, సైదారావు,సందీప్,పల్లా వెంకన్న,శంకర్ పాల్గొన్నారు.