యాదాద్రి జిల్లా:రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని వైఎస్సార్ టీపి అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు.ప్రజాప్రస్థానంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం పాటిమట్లలో ఆమె మాట్లాడుతూ వైయస్ఆర్ పథకాలు నేటికీ సజీవంగా ఉన్నాయంటే అది ఆయన పాలన దక్షతకు నిదర్శనం అన్నారు.కేసీఆర్ పథకాలు ఏ కుటుంబానికి కూడా సరిగ్గా అందలేదని,రైతుబంధు పథకంలో మోసాన్ని ప్రజలు గమనించాలని,ఎకరాకు రూ.5వేలు ఇచ్చి, రూ.25వేల విలువైన పథకాలు బంద్ పెట్టిండని, వైయస్ఆర్ సబ్సిడీపై విత్తనాలు,ఎరువులు అందించారని గుర్తు చేశారు.పంట నష్టపోతే పరిహారం ఇచ్చారని,ఇన్ పుట్ సబ్సిడీ,యంత్ర లక్ష్మి పథకాల ద్వారా ఆదుకున్నారని,కానీ,కేసీఆర్ ఎకరాకు రూ.5వేలు ఇచ్చి,మిగతావన్నీ బంద్ పెట్టిండని ఆరోపించారు.ఆ రూ.5వేలు బ్యాంకు రుణాలకు వడ్డీకి కూడా సరిపోవని,రైతు బంధు ఇస్తానని మోసం చేసిండని,కౌలు రైతులను ఆగం జేసిండని,రైతుగా కూడా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని,దళితులకు మూడెకరాలు,రైతు రుణమాఫీ,నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం,డబుల్ బెడ్ రూం ఇండ్లు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఇలా అన్ని రకాల హామీలు ఇచ్చి మోసం చేసిండన్నారు.
కేసీఆర్ చేతిలో మళ్లీ మళ్లీ మోస పోవద్దని,రాబోయే ఎన్నికల్లో ఎన్నో దొంగ హామీలు ఇస్తడని,ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు.కేసీఆర్ దుర్మార్గ పాలన సాగిస్తున్నా ప్రతిపక్షాలు ఏనాడు ప్రశ్నించలేదని,అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించామని చెప్పారు.
ప్రజలు ఆశీర్వదిస్తే మహిళలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, ఉచిత విద్య,వైద్యం అందిస్తామని,వైయస్ఆర్ సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తామని తెలిపారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా మీ ఆత్మీయుడు ఏపూరి సోమన్నను ప్రకటించామని,రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా సోమన్నకు మద్దతు తెలపాలని కోరారు.