నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలో పశు వైద్యం అందని ద్రాక్షలా మారి పాడిపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మర్రిగూడ పరిధిలోని సబ్ సెంటర్లు కొండూరు,శివన్నగూడ గ్రామాల్లో పశు వైద్యశాలలు పూర్తిగా మూతపడ్డాయి.
కొండూరు వైద్యశాలను కొన్ని ఏండ్ల క్రిందట నిర్మించారు.కానీ,సిబ్బందిని కేటాయించకపోవడంతో ప్రారంభం నుంచే మూతపడి నిరుపయోగంగా ఉంది.
అలాగే శివన్నగూడ పశు వైద్యశాల కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉండడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు.గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది ఉన్నారా…లేరా…అని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో శివన్నగూడ పశు వైద్యశాలలో విధులు నిర్వహించిన పశు వైద్యాధికారి ఈ మధ్యకాలంలో డిప్యూటేషన్ ద్వారా వేరే చోట విధులు నిర్వహిస్తున్నారు.ఇక్కడ జీతం తీసుకుంటూ వేరొక చోట పనిచేయడం ఏంటని
పాడి రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
మండలంలో 3 పశువైద్య కేంద్రాలకు గాను 8 మంది సిబ్బంది అవసరం ఉండగా మండల కేంద్రంలో ఒక డాక్టర్,ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఇద్దరే మండలంలోని 18 గ్రామపంచాయతీల్లో ఉన్న మూగజీవాలకు వైద్య సేవలందిస్తున్నారు.శివన్న గూడ,కొండూరు పశు వైద్యశాలలో డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో అనేక మూగజీవాలకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి.
కొన్ని గ్రామాల పాడి రైతులు అత్యవసర సమయంలో వైద్యం కోసం మండల కేంద్రానికి రావాలంటే సుమారు 10కీ.మీ నుంచి 20 కీ.మీ దూరం కాలి నడకన రావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.2019 పశుగణన ప్రకారం మండల వ్యాప్తంగా 41390 మూగజీవాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డాక్టర్లను,వైద్య సిబ్బందిని నియమించి,గ్రామాల్లో ఉన్న సబ్ సెంటర్లను వినియోగంలోకి తీసుకొచ్చి, మూగజీవాలకు మెరుగైన సేవలు అందించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని,సంబంధిత అధికారులను కోరుతున్నారు.