నులిపురుగులు.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చిన్నారులను పట్టి పీడించే అనారోగ్య సమస్యల్లో నులిపురుగులు ముందు వరసలో ఉంటాయి.ఇవి పిల్లల పొట్టలో చేరి.
వారిని పీల్చి పిప్పి చేస్తాయి.కడుపులో నులిపురుగులు ఉంటే పిల్లల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా ఎదుగుదల ఆగిపోవడం, పోషకాల కొరత, ఆకలి మందగించడం, రక్తహీనత, తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, వాంతులు, నీరసం, బలహీనత, అతిసారం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం ఇలా రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి.
దాంతో తరచూ పిల్లలను హాస్పటల్స్ చుట్టూ తిప్పుతూ తల్లిదండ్రులు తీవ్రంగా విసిగిపోతుంటారు.
అందుకే నులిపురుగులు వచ్చాక బాధ పడటం కంటే.అవి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
మరి ఇంతకీ పిల్లల్లో నులిపురుగులు ఏర్పడకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి.
పిల్లల్లో నులిపురుగులు సంక్రమించడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత.
అందుకే ఇంటిని, ఇంటి పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.పిల్లలు తినే ఆహారాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి.

పిల్లలకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే పట్టించాలి.ఉడికీ ఉడకని ఆహారాన్ని పొరపాటున కూడా పిల్లలకు పెట్టరాదు.వారి చేతి గోర్లలో దుమ్ము, ధూళి లేకుండా తరచూ క్లీన్ చేయాలి.పెరిగిన గోర్లను కత్తిరించాలి.
మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు పిల్లల చేత తప్పనిసరిగా చేతులను కడిగించాలి.కాళ్లకు చెప్పులు లేకుండా వారిని బయటకు అస్సలు పంపరాదు.
మట్టిలో ఆడటం, మట్టి తినడం వంటి అలవాట్లను పిల్లల చేత మానిపించాలి.ఇక దానిమ్మ పండ్లు, క్యారెట్, స్వచ్ఛమైన తేనె, వెల్లుల్లి, ఆరెంజ్, పుదీనా, కీర దోస వంటి ఆహారాలు పిల్లలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆహారాలు కడుపులో ఉండే నులిపురుగులను నాశనం చేయడమే కాదు.మళ్లీ మళ్లీ ఏర్పడకుండా అడ్డు కట్ట కూడా వేస్తాయి.