అమెరికా అధ్యక్షుడిగా(United States) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతర్జాతీయ వలసదారులు, ముఖ్యంగా విద్యార్ధులపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారి వారి స్వదేశాలకు తరలిస్తున్నారు.
ఇక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విదేశీ విద్యార్థులను కూడా ఏరిపారేయ్యాలని ట్రంప్ భావిస్తున్నారు.హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధానికి మద్ధతుగా క్యాంపస్‌లలో ఆందోళనకు దిగిన వారిని వేటాడుతున్నారు ట్రంప్.
నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా వీటికి సోషల్ మీడియాలో మద్ధతు ఇచ్చిన వారిని కూడా బహిష్కరించాలని ట్రంప్ (Trump)యంత్రాంగం భావిస్తోంది.ఇందుకోసం అధికారులు ఏఐ వంటి సాంకేతిక సాయం తీసుకుంటున్నారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే అలాంటి వారు స్వచ్ఛందంగా సీబీపీ యాప్ ద్వారా అమెరికాను వీడాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏ క్షణంలో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందోనని అంతర్జాతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఈ నేపథ్యంలో కొందరు విద్యార్ధులు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవల ఎఫ్ 1 వీసాపై (F1 visa)ఉన్న విద్యార్ధి ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను చట్ట విరుద్ధంగా, అకస్మాత్తుగా రద్దు చేయడంపై కోర్టును ఆశ్రయించాడు.చైనాకు చెందిన సదరు విద్యార్ధి డార్ట్‌మౌత్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు.గత శుక్రవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)(Department of Homeland Security) అతని విద్యార్ధి స్టేటస్‌ను రద్దు చేసినట్లుగా కళాశాల నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.
అతని తరపున దావా వేసిన అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ న్యూహాంప్‌షైర్.యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ (న్యూహాంప్‌షైర్)ను ఆశ్రయించి చైనా విద్యార్ధి చదువు కొనసాగించడానికి వీలు కల్పించాలని కోరింది.

ట్రంప్ అధికార యంత్రాంగం ఈ ఒక్క కేసులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ విశ్వవిద్యాలయాలలోనూ స్టూడెంట్ వీసాలను , ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను అకస్మాత్తుగా రద్దు చేయడంపై తాము ఆందోళన చెందుతున్నామని యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.మన విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ విద్యార్ధులు ఒక ముఖ్యమైన సమాజమని పేర్కొంది.వారి స్టేటస్‌ను ఏకపక్షంగా తొలగించడానికి, వారి చదువులకు అంతరాయం కలిగించడానికి ఏ చట్టాన్ని అనుమతించకూడదని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అభిప్రాయపడింది.







