అమెరికాలో భారతీయ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేదికి, ఆమె స్నేహితురాలికి ఊహించని, దారుణమైన అనుభవం ఎదురైంది.కేవలం తాము నల్లగా ఉన్నామన్న కారణంతోనే, జాతి వివక్షతో తమను అలస్కాలోని యాంకరేజ్ విమానాశ్రయంలో గంటల తరబడి అన్యాయంగా నిర్బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’ (‘India Action Project’)వ్యవస్థాపకురాలైన శ్రుతి చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం.అసలు నిబంధనలకు విరుద్ధం కాని ఒక పవర్ బ్యాంక్‌ను ఆమె స్నేహితురాలి హ్యాండ్ బ్యాగ్‌లో ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది గుర్తించడంతో ఈ దారుణ ఘటన మొదలైంది.
నిజానికి, అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (TSA) నిబంధనల ప్రకారం, పవర్ బ్యాంక్‌లను క్యారీ-ఆన్ బ్యాగేజీలో (మనతో పాటు విమానంలోకి తీసుకెళ్లే బ్యాగ్) అనుమతిస్తారు, కానీ చెక్-ఇన్ లగేజీలో(check-in luggage) (విమానం కార్గోలో వెళ్లే లగేజ్) పెట్టకూడదు.
ఇది చాలా సాధారణ విషయం.కానీ, శ్రుతి స్నేహితురాలు తన హ్యాండ్‌బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ (Power bank)ఉంచుకోవడం పెద్ద రచ్చకు దారితీసింది.అది కాస్తా గంటల తరబడి వేధించే భయంకరమైన అనుభవంగా మారింది.
అసలు విషయం ఏంటంటే, శ్రుతి(Shruti) తన స్నేహితురాలిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి, కొన్ని గంటల తర్వాత తన ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇంతలో, తన స్నేహితురాలి నుంచి ఊహించని మెసేజ్ వచ్చింది.“నా పాస్‌పోర్ట్ తీసుకున్నారు, నన్ను నిర్బంధించారు” అని ఆ మెసేజ్‌లో ఉంది.ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.దీంతో కంగారుపడిన శ్రుతి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి హుటాహుటిన మళ్లీ ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు తీశారు.కానీ అక్కడ ఆమెకు ఊహించని షాక్ తగిలింది.అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేసిన శ్రుతిని కూడా అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత అసలు డ్రామా మొదలైందని శ్రుతి ఆరోపించారు.భద్రతా అధికారులు కావాలనే తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని ఆమె అన్నారు.వాళ్లు ఆ పవర్ బ్యాంక్‌ను తీసుకుని, బలవంతంగా ఆమె స్నేహితురాలి బ్యాగ్ లోపల డక్ట్ టేప్‌తో అతికించారని చెప్పారు.అలా అతికించి ఫోటోలు తీసి, ఆమె స్నేహితురాలు దాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించిందని FBIకి తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రుతి ఆరోపించారు.
ఇదంతా పూర్తిగా అబద్ధమని ఆమె స్పష్టం చేశారు.
ఇంతటితో ఆగకుండా, తనను ఏడు గంటలకు పైగా నిర్బంధించారని శ్రుతి వాపోయారు.ఈ సమయంలో కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేసుకోనివ్వలేదని, ఒక పురుష అధికారి తనను అసభ్యంగా తడిమి తనిఖీ చేశాడని (ఫ్రిస్క్డ్), తన ఒంటిపై ఉన్న వెచ్చని దుస్తులను తీసేసి, చలిగా ఉన్న గదిలో బలవంతంగా కూర్చోబెట్టారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.తమకు ఎదురైన ఈ కఠినమైన అనుభవానికి, వేధింపులకు కారణం భద్రతాపరమైన సమస్య కాదని, కేవలం తాము నల్లగా ఉన్నామన్న జాతి వివక్షే కారణమని శ్రుతి బలంగా ఆరోపిస్తున్నారు.
తమ చర్మం రంగే వారికి సమస్యగా మారిందని, అందుకే ఇంత దారుణంగా ప్రవర్తించారని ఆమె అన్నారు.ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.