రైళ్లలో ప్రయాణించే వారికీ దొంగతనాలు కొత్తమీకాదు.నిత్యం ఏదో ఒక చోట రైల్వే దొంగలు తమ పన్నాగాలు చేస్తూ, అమాయక ప్రయాణీకుల విలువైన వస్తువులను మాయం చేస్తూ ఉంటారు.
ప్రయాణీకులు ఎంత అప్రమత్తంగా ఉన్నా, కొన్నిసార్లు ఈ దొంగలు వారి చాకచక్యంతో క్షణాల్లో సెల్‌ఫోన్‌లు, నగలు, పర్సులు లాంటి విలువైన వస్తువులను అపహరిస్తుంటారు.ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చున్న వారే వీరి టార్గెట్‌గా మారుతుంటారు.
అయితే, తాజాగా బీహార్‌లో జరిగిన ఒక ఘటన మాత్రం దొంగకు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠంగా మారింది.దొంగ చేసిన ప్రయత్నం విఫలమై, చివరకు అతడు రైలు నుంచి వేలాడుతూ నరకయాతన అనుభవించిన తీరును చూస్తే ఎవరికైనా మళ్లీ ఇలాంటివి చేయాలనిపించదు.
ఈ ఘటన బీహార్ రాష్ట్రం, భగల్‌పూర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.రైలు స్టేషన్ మాస్టర్ పచ్చ జెండా ఊపడంతో నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది రైలు.ఆ సమయాన ఓ దొంగ రైలు కిటికీలోకి చేయి పెట్టి ప్రయాణికుడి సెల్‌ఫోన్ దొంగిలించాలనే యత్నం చేశాడు.కానీ, దొంగకంటే ముందు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం వల్ల అతడి యత్నం విఫలమైంది.
ప్రయాణికులు వెంటనే దొంగ చేతిని గట్టిగా పట్టేశారు.అప్పటికే రైలు కదలడం మొదలైంది.
తప్పించుకునే అవకాశం లేకపోయిన దొంగ చివరకు రైలుకు వేలాడుతూ కష్టాలు అనుభవించాల్సి వచ్చింది.
దొంగతనం జరగాలనుకున్న స్టేషన్ నుంచి మరో స్టేషన్ వచ్చేవరకు ప్రయాణికులు అతడిని విడిచిపెట్టలేదు.అతడిని కిటికీకి వేలాడదీసి, ప్రయాణికులే అతడిపై చేతులెత్తారు.కొట్టుకుంటూ, దేహశుద్ధి చేస్తూ నెక్ట్స్ స్టేషన్ వచ్చేంత వరకూ వదిలిపెట్టలేదు.
రైలు నెమ్మదించడంతో కొంతమంది ప్రయాణికులు దిగిపోయి అతడిని రైల్వే పోలీసులకు అప్పగించారు.రైల్వే పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అనంతరం అతడిని జైలుకు తరలించారు.ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియకపోయినా, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సంఘటన రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక కావాలి.విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పనిసరి.
అదే సమయంలో ఇటువంటి దొంగలకు చక్కటి గుణపాఠం చెబుతూ, తగిన శిక్షలు అమలు కావడం సమాజానికి మంచిదే.