నల్లగొండ జిల్లా:అత్తామామ,భర్త వేధింపులకు తాళలేక తన పుట్టింటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ నవ వధువు.కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం కొరివేనిగూడెం గ్రామానికి చెందిన సీతా లక్ష్మయ్య కుమార్తె సీతా కావ్యను నేతాపురం గ్రామానికి చెందిన బొల్లెంపల్లి మహేష్ కు ఇచ్చి గత కొన్ని నెలల క్రితం వివాహం జరిపించారు.
పెళ్లి సమయంలో కట్నకానులతో పాటు అన్ని రకాల లాంఛనాలతో ఘనగా వివాహం జరిపించారు.కానీ,ఆ అమ్మాయికి అత్తింటి వారి వేధింపులు మాత్రం తప్పలేదు.
అత్తామామలే కాకుండా తాళికట్టిన భర్త కూడా వేధించడంతో తట్టుకోలేకపోయింది సీతా కావ్య.వేధింపులు అధికం కావడంతో పుట్టింటికి వెళ్లి పురుగుల మందు సేవించి ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆమె భౌతికకాయాన్ని అనుముల మండల ఎంపిపి సలహాదారు ఆవుల పురుషోత్తం యాదవ్,హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్ సందర్శించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కావ్య మరణానికి కారణమైన అత్తింటి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేకూరుస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.గ్రామ సర్పంచ్ ఎం.వెంకట్ రెడ్డి,సీతా వెంకటేశ్వర్లు,సీతా నాగరాజు,చెరుకుపల్లి అంజి,దైద అంజయ్య,గ్రామ ప్రజలు కావ్య మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.