నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora ) బసిరెడ్డిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మన ఊరి- మనబడి ( Mana Ooru Mana Badi )కార్యక్రమంలో బెస్ట్ అవార్డు అందుకుంది.అదే పాఠశాల అవరణం నేడు చెత్త కుప్పలతో నిండిపోయి భరించలేని దుర్గంధం వెదజల్లుతూ పాఠశాల విద్యార్థులకు రోజూ నరకం కనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు .
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గప్ఫాలు కొట్టడమే కానీ,ఆచరణలో అంతా శూన్యమని ఈ ప్రభుత్వ పాఠశాలలను చూస్తే అర్థమవుతుందనిఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలో కనీస వసతులైన త్రాగునీరు,మరుగుదొడ్ల సౌకర్యం లేదని,పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగడంతో దోమలు, విషసర్పాలతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాల( Government school ) ఇంత దారుణంగా ఉందంటే మరి మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు ఏమైనవని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.కార్పొరేట్ విద్యను ఓ పక్క ప్రోత్సహిస్తూ మరోపక్క “కార్పొరేట్ విద్య వద్దు ప్రభుత్వ పాఠశాలలలే ముద్దు” అని చెప్పడం దేనికి సంకేతమని నిలదీస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంటే ఉన్నతాధికారుల నిఘా ఏమైందని విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నారు.ఈ పాఠశాలకు విద్యార్థులను పంపించాలంటే భయమేస్తుందని, కార్పొరేట్ ఫీజులు కట్టలేక విధి లేని పరిస్థితిలో పంపుతున్నామన్నారు.
ఇప్పటికైనా సంభందిత అధికారులు చొరవ తీసుకుని పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా మార్చి,కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు,విద్యార్థి సంఘాల నేతలు కోరుటున్నారు.