నల్లగొండ జిల్లా:గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ,కూలీనాలి చేసుకుంటూ జీవిస్తున్న నకిరేకల్ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య చిరుమర్తి పర్వతమ్మకు టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి కాంగ్రేస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం చేశారు.గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసేందుకు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చేరుకున్న ఎంపీ,నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని ఇంటికెళ్లి పరామర్శించారు.
ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని,డాక్టర్ తో ఫోన్లో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.నకిరేకల్ ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్య నిరాదరణకు గురై ఇంటరిగా కూలీ పనులకు వెళ్లి బ్రతుకీడుస్తున్న పార్వతమ్మ ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుంది.
చిరుమర్తి పార్వతమ్మను పరామర్శించి,ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎంపీ, ఏం భయపడాల్సిన అవసరం లేదని, భయపడితే మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని, ఏదైనా అవసరమైతే వెంటనే తనకు తెలియజేయాలని భరోసా ఇచ్చారు.ప్రస్తుతం వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేశారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒకే గ్రామానికి చెందిన వారు కావడం,కోమటిరెడ్డికి చిరుమర్తి నమ్మిన బంటుగా ఉండేవారు.చిరుమర్తికి ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇప్పించడం,గెలిపించడం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కావడం గమనార్హం.2018లో రెండవసారి నకిరేకల్ నుండి కాంగ్రేస్ అభ్యర్థిగా పోటీ చేసి,ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి కోమటిరెడ్డి బ్రదర్స్ కి షాక్ ఇచ్చి, అధికార టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అదే ఎమ్మెల్యే భార్యకు ఎంపీ ఆర్ధిక సాయం చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.