నల్లగొండ జిల్లా:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బీజేపీ పాలిత రాష్ట్రాల బడ్జెట్ గా ఉందని,పూర్తిగా కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా,ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు,దామరచర్ల మండల కమిటీ కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్ ఆరోపించారు.నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంబానీ,ఆదానీలకు మేలు చేసే విధంగా ఉందని, ఇది ముమ్మాటికీ పేదల సంక్షేమాన్ని కాంక్షించే బడ్జెట్ కాదని దుయ్యబట్టారు.
ఆర్ఎస్ఎస్,కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ ను రూపొందించి,దేశ ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టే స్థితికి మోడీ ప్రభుత్వం దిగజారిందని,వ్యవసాయ రంగాన్ని,ఉపాధి రంగాన్ని, విద్య,వైద్య రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని, అత్యధికంగా పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీలో నిధులను పూర్తిగా తగ్గించి పేదల నోట్లో మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలకు,కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్రాలకు తప్ప బడ్జెట్లో కేటాయింపులు మిగతా రాష్ట్రాలకు కేటాయించలేదని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టడమే కాదు,కనీసం తెలంగాణ పదాన్ని ఎత్తడానికి కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ చూపలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు,ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేటాయింపులు చేయించడంలో చిత్తశుద్ధి చూపలేకపోయారని వాపోయారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నుండి ఒక పైసా కూడా కేటాయింపులు చేయించలేని బీజేపీ కేంద్ర మంత్రులు,ఎంపీల వల్ల ఈ రాష్ట్రానికి ఏమి ఉపయోగమని ప్రశ్నించారు.రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడని బీజేపీ మంత్రులకు,ఎంపిలకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను దేశ ప్రజలందరూ ఏకోన్ముఖంగా తిరస్కరించాలని,కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనించి తెలంగాణ పట్ల వ్యతిరేక మొండివైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పాపా నాయక్,దయానంద్,కోటిరెడ్డి, ఎర్ర నాయక్,ఖాజా తదితరులు పాల్గొన్నారు.