నల్లగొండ జిల్లా:కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను వెల్లడించిన విషయం తెలిసిందే.దీనితో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కోలాహలం మొదలైంది.
నేడు నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఇక నామినేషన్ల ప్రక్రియపై ఫోకస్ చేశాయి.నామినేషన్ వేసేందుకు అధికార యంత్రాంగం చండూరు మండల కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రిటర్నింగ్ అధికారి,నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి గురువారం కలెక్టరేట్‌లో అన్ని పార్టీల నాయకులతో సమావేశమై కొత్త ఓటర్ల నమోదుపై చర్చించారు.సునిశితంగా పరిశీలించిన తర్వాతే ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించి,రాష్ట్ర అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని పరిస్థితిని వివరించారు.ఈ నెల14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ,15న నామినేషన్ల పరిశీలన,17న ఉపసంహరణకు గడువు ఉండగా,నవంబరు 3న పోలింగ్,6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
నామినేషన్లను చండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారు.రెండో శనివారంతో పాటు ఆదివారం సెలవు రోజులైనందున నామినేషన్లను స్వీకరించరు.
మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి చండూరు మండల కేంద్రంగానే నామినేషన్ల స్వీకరణ కొనసాగిస్తున్నారు.సమితిలు ఉన్న కాలం నాటి నుంచి ఈ ప్రక్రియ ఇక్కడే కొనసాగుతోంది.
అప్పట్లో బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ ఉన్నందున,చండూరులోని సబ్‌ట్రెజరీ కార్యాలయంలోనే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేవారు.ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి కూడా చండూరులోనే ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు.