నల్లగొండ జిల్లా: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి సిపిఐ(ఎం) తప్పక పోటీ చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.సంక్షేమం,ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం చేపట్టిన జన చైతన్య యాత్ర ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చేరుకున్న సందర్భంగా మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద జన చైతన్య యాత్రకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆలగడప నుండి మున్సిపల్ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కులం మతం పేరుతో ప్రజల్లో విద్వేషాలు సృష్టించి,హిందుత్వ సెంటిమెంట్ తో అధికారం దక్కించుకునేందుకు పాకులాడుతుందని,
అలాంటి పార్టీకి తెలంగాణ గడ్డపై స్థానం ఉండదని చెప్పారు.
మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండకట్టేందుకు సిపిఐ(ఎం) కృషి చేస్తుందన్నారు.బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేస్తామన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల గెలుపులో కమ్యూనిస్టు పార్టీలు కీలకంగా మారిన వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారని చెప్పారు.
అనేక సభల్లో కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పారని,భవిష్యత్తులో కూడా కలిసి పని చేస్తామని క్లారిటీ ఇచ్చారు.మోడీని గద్దే దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయని తెలిపారు.
సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన సభలో అఖిల భారత కిసాన్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్,సుదర్శన్, మల్లు లక్ష్మి,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.