నల్లగొండ జిల్లా:తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది.ఏడాది క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారనే వార్తలు కూడా వచ్చాయి.
అదే సమయంలో ఇక కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కూడా చేశారు.దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడి కాషాయ కండువా కప్పుకుంటారని చర్చ జోరుగానే సాగింది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని అంతా భావించారు.మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకువచ్చి, దుబ్బాక,హుజురాబాద్ ఫార్ములాలో విజయం సాధించి తెలంగాణలో అధికారం దిశగా ముందుకు కదలాలని కమలనాథులు స్కెచ్ వేశారనే ప్రచారం కూడా జరిగింది.
అయితే ఎందుకో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు.అదే సమయంలో ఆ పార్టీలో యాక్టివ్ గా కూడా ఉండటం లేదు.
ఇటీవలే టీపీసీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కానీ, రాజగోపాల్ రెడ్డి సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టలేదు.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీకి భారీగా సభ్యత్వ నమోదు కాగా,ఎమ్మెల్యే ఉండి,పార్టీ బలంగా ఉన్న మునుగోడు మాత్రం చివరలో నిలిచింది.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోవడంతో సభ్యత్వ నమోదును పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా పట్టించుకోలేదు.పార్టీ మారాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు కాబట్టే, రాజగోపాల్ రెడ్డి సభ్యత్వ నమోదు చేయించలేదని అనుకుంటున్నారు.
ఇక అసలు విషయానికొస్తే రాజగోపాల్ రెడ్డి చేరికను కమలం పార్టీ వ్యూహం ప్రకారమే ఆపేసిందని తెలుస్తోంది.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే వాయిదా వేశారని అంటున్నారు.
ఇప్పుడు యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా,మణిపూర్ లో కమలం పార్టీ ఘన విజయం సాధించడంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది.ఇదే స్పీడును తెలంగాణలోనూ కొనసాగిలంచాలని కమలం పార్టీ డిసైడై,మునుగోడుకు ఉప ఎన్నిక తేవాలని నిర్ణయించిందని తెలుస్తోంది.
దీంతో వారం రోజుల్లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మలివిడత పాదయాత్ర మార్చి 14న ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందంటున్నారు.అమిత్ షా వస్తే ఆయన సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
మరో మూడు రోజుల్లో మునుగోడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని రాజకీయ వర్గాల భోగట్టా,అది హిట్టా ఫట్టా అనేది చూడాలి మరి…
.