నల్లగొండ జిల్లా: ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా 55 మందితో ఆదివారం విడుదల చేసింది.అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం ఆరు స్థానాలకు ప్రస్తుతం అభ్యర్ధులను ఖరారు చేసింది.
మిగతా ఆరు స్థానాలలో ఆశావాహులు సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆచితూచి అడుగులు వేస్తుందని తెలుస్తుంది.తొలి జాబితాలో స్థానం దక్కించుకున్న అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఆలేరు బీర్ల ఐలయ్య, నకిరేకల్ వేముల వీరేశం, నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లను ఖరారు చేయగా,ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, తుంగతుర్తి,భువనగిరి, మునుగోడు, సూర్యాపేట,దేవరకొండ,భువనగిరి ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టింది.భువనగిరి నుండి కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ బీసీ నేత పాంజాల రామాంజనేయులు గౌడ్ ప్రధాన పోటీ దారుడుగా ఉన్నారు.మునుగోడు టికెట్ రేసులో పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల్ల కృష్ణారెడ్డి, పున్న కైలాష్ నేత పోటీ పడుతున్నారు.
సూర్యాపేట టికెట్ రేసులో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి నువ్వా నేనా అంటున్నారు.దేవరకొండ టికెట్ రేసులో బాలూ నాయక్,రవి నాయక్,కిషన్ నాయక్, రమేష్ నాయక్ ఉన్నారు.
తుంగతుర్తిలో అద్దంకి దయాకర్,ప్రీతం, మోత్కుపల్లి నర్సింహులు, వడ్డే రవి కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి.మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి,కుందూరు రఘువీర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది.ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీపీఐ పొత్తు ఖరారు అయినట్లు తెలుస్తోంది.పొత్తులో భాగంగా మునుగోడు సీటు ఇస్తానని ప్రచారం జరిగినా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం.
సీపీఎంతో కొనసాగుతున్న కాంగ్రెస్ చర్చలు.పొత్తులో భాగంగా మిర్యాలగూడ టికెట్ సీపీఎంకి కేటాయించే ఛాన్స్ ఉందని, దానికి తోడు భద్రాచలం టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారని వినికిడి.మొత్తం మీద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ తొలి జాబితాలో ఆరుగురికి టిక్కెట్ ఖరారు చేస్తే అందులో నకిరేకల్ ఎస్సీ రిజర్వుడు స్థానం మినహా ఆలేరు మాత్రమే బీసీ నేతకు కేటాయించి, మిగతా నాలుగు స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడంతో బీసీలు రగిలిపోతున్నారు.మలి జాబితాలో కూడా ప్రముఖంగా భువనగిరి కుభం అనిల్ కుమార్ రెడ్డి, సూర్యాపేట రామిరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి,మునుగోడు పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల్ల కృష్ణారెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి,కుందూరు రఘువీర్ రెడ్డి,లేదంటే పొత్తులో భాగంగా
సీపీఎం జూలకంటి రంగారెడ్డికి దక్కే అవకాశం ఉంది.
ఇక మిగిలింది దేవరకొండ ఎస్టీ రిజర్వుడు,తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు స్థానాలు.ఒకవేళ రెండవ విడతలో వినిపిస్తున్న పేర్లను కాంగ్రెస్ ఖరారు చేస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం 8 స్థానాలు రెడ్లకు,ఒక స్థానం బీసీకి,రెండు ఎస్సీ,ఒకటి ఎస్టీగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
దీనితో అనుకున్నట్లే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.ఇది కాంగ్రెస్ కు మేలు చేస్తుందా లేదా? బీసీ ఓటు బ్యాంక్ ఎలా మలుపు తిరిగే అవకాశం ఉందనేది కొంత కాలం వేచి చూడాల్సిందే మరి…?!
.