నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు దసరా పండుగ కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నారు.ఆ ఎదురు చూపులు పండుగ సంబరాల కోసం అనుకుంటే పొలంలో కాలేసినట్లే.
అన్నదాతల ఎదురుచూపు మొత్తం రైతు భరోసా కోసం.గత ప్రభుత్వం రైతుకు ఏటా ఖరీఫ్,రబీ సీజన్లో సాగుకు ఆర్థిక సహాయం అందించడానికి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రైతు భరోసాగా మార్చింది.రైతు భరోసా కింద ఆర్థిక సాయం జూలైలోనే అందాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఆలస్యం చేయగా, రుణమాఫీ నేపథ్యంలో ఇంకాస్త వెనక్కి వెళ్ళింది.
ఆగస్టు 15 నుంచి మొదలైన రుణమాఫీ మూడు విడతలుగా చేసినా కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోగా,అయిన వారు కూడా ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారనేది అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే అక్టోబర్ లో దసరా ఉండడంతో దసరాకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
కానీ,ఎక్కడో చిన్న సంశయం కొడుతుంది.ఇంకా మార్గదర్శకాలపై ప్రభుత్వం మధనం చేస్తూనే ఉంది.
ప్రభుత్వం రైతు భరోసా నిధుల జమకు సంబంధించి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై ఆందోళనలో రైతులు ఉన్నట్లు తెలుస్తుంది.ముఖ్యంగా సన్న,చిన్న కారు రైతులకు ఢోకా లేకున్నా పెద్ద రైతులలో ఆందోళన వ్యక్తమవుతుంది.
కటాఫ్ ఎన్ని ఎకరాలు ఉండబోతుందోనన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి.ప్రభుత్వం 10 ఎకరాల లోపు ఉన్నవారికి వేస్తే మిగతా వారికి రైతు భరోసా దూరం కానుంది.
అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి కూడా భరోసా కోత పెడుతుందా? లేదా? కౌలు రైతులపై స్పష్టత లేకపోవడం వల్ల కూడా అనేక మంది మదన పడుతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ దసరాకు రైతుకు భరోసా దక్కేనా అనేది ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వినిపిస్తున్న టాక్.