నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది.చలికాలంలో నువ్వానేనా అన్నట్లు సాగుతున్న ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నాయి.
ప్రచారాన్ని విస్తృతం చేయడానికి జాతీయ అగ్రనేతలు సైతం రాష్ట్రానికి రానున్నారు.జాతీయ నేతలు రాష్ట్రంలో తిష్టవేసి ప్రచారం ఉద్ధృతం చేయనున్నారు.
అగ్రనేతల రాకతో రాష్ట్రం కోలాహలంగా మారనుంది.రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది.
వారం రోజుల పాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా జాతీయ నేతలు,రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లనున్నారు.
సభలు, సమావేశాలు,ర్యాలీల కోసం బీజేపీ,కాంగ్రెస్,బీఆర్ఎస్, వామపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి.బీజేపీ అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్ షా,జెపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,మల్లికార్జున ఖర్గే, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్,జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, బృందాకారాత్ సహా పలువురు ముఖ్యనేతల ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి.
గతంలో ఎన్నడూ లేనట్లుగా బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఈ నెల 23తో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో వారు తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొననున్నారు.చివరి మూడు రోజులు రాజకీయ పార్టీలన్నీ హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టాయి.
బహిరంగ సభలు,రోడ్ షోలు,ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 25,26,27 తేదీల్లో మూడు రోజులు పూర్తి స్థాయిలో పాల్గొననున్నారు.25న రాష్ట్రానికి రానున్న మోదీ 27 వరకు ఇక్కడే ఉంటూ సభలు,ర్యాలీల్లో పాల్గొంటారు.25న కామారెడ్డి,మహేశ్వరం, 26న తూప్రాన్,నిర్మల్‌లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు.
27న మహబూబాబాద్,కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం 24, 26,28 తేదీల్లో ఉండనుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలలో పాల్గొననున్నారు.అదేవిధంగా ప్రచారంలో మరింత జోష్ పెంచెందుకు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్,హిమంత్ బిశ్వశర్మ,ప్రమోద్ సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు.
తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం.తమ అభ్యర్థికే ఓటు వేయాలంటున్న స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్,ప్రియాంక 24 నుంచి 28 వరకు ఇరవైకి పైగా సభల్లో పాల్గొననున్నారు.
ప్రియాంక 24,25,27 తేదీల్లో పర్యటించే 10 నియోజకవర్గాలను ఆ పార్టీ ఖరారు చేసింది.24న పాలకుర్తి,హుస్నాబాద్, ధర్మపురి సభల్లో,25న పాలేరు, ఖమ్మం,వైరా,మధిర,27న మునుగోడు,దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగించనున్నారు.రాహుల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోనే ఉండనున్నారు.కామారెడ్డిలోని సభలో రాహుల్ 26న పాల్గొంటారు.మూడు లేదా నాలుగు రోజులు సభలు, ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు 28న రాష్ట్రంలో ప్రచారం ముగించనున్నారు.ఇక సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్,సుభాషిణి అలీ, విజయరాఘవన్ ఇతర ముఖ్యనేతలు 25,26,27 తేదీల్లో నల్గొండ,ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 25న హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.28న వరంగల్,గజ్వేల్ బహిరంగ సభల్లో పాల్గొని ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు.జనసేన,బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈనెల 22(బుధవారం) నుంచి సభల్లో పాల్గొంటారు.వరంగల్ వెస్ట్,కొత్తగూడెం,సూర్యాపేట, దుబ్బాక,తాండూరు సభల్లో పాల్గొననున్నారు.అలాగే 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో అమిత్ షాతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు.అధికారమే లక్ష్యంగా ప్రచారాల జోరు విమర్శలతో రసవత్తరంగా మారుతున్న రాజకీయం.
గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం.ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట.రాజకీయ నేతల ఎన్నికల ప్రచారంతో రాష్ట్రం వేడెక్కుతోంది.