నల్లగొండ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏడు కంపెనీల కేంద్ర బలగాలు, 2600 మంది జిల్లా సిబ్బందితో ఎన్నికల నిర్వహణ పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు,
జిల్లా వ్యాప్తంగా 1677 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 313 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు.సమస్యాత్మక గ్రామాలను సిబ్బంది విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టి సారిస్తు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లా పోలీసు సిబ్బంది,కేంద్ర సాయుధ బలగాలు కలిసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల్లో భరోసా కల్పిస్తూ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ చైతన్యం కల్పిస్తున్నామన్నారు.ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద 7 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.