నల్లగొండ జిల్లా:రైతు సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉందని,శ్రమ దోపిడి నుండి పీడిత ప్రజలను విముక్తి చేయడం కోసం రైతు సంఘం ఏర్పడిందని ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాల ప్రాంగణంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో4 వేలమంది బలిదానం అయితే అందులో వెయ్యి మంది నల్గొండ జిల్లా నుండి ఉన్నారని,వీరనారీమణి స్వర్గీయ మల్లు స్వరాజ్యం పుట్టిన గడ్డ నల్లగొండకు నేను రావడం గర్వకారణంగా ఉందన్నారు.
కిసాన్ సభ ఆవిర్భావం నుండి రైతుల కోసం అనేక పోరాటాలు నడిపిందని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనివలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు లేకుండా పోయిందని,కిసాన్ సభ ఆరంభం నుండి భూమీ కోసం,భుక్తి కోసం,పేద ప్రజల విముక్తి కోసం పోరాటాలు చేస్తూనే ఉందని,ఇకపై కూడా చేస్తుందన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు రైతుల నడ్డి విరుస్తున్నాయని,దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని,సరైన గిట్టుబాటు ధర లేక రోజుకు 50 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.స్వామినాథన్ కమిషన్ సిపారస్ ను ఇప్పటికి అమలు పరచడం లేదని,నరేంద్ర మోడీ దేశాన్ని కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి రైతులకు ద్రోహం చేస్తూ శత్రువుగా మారిపోయాడని విమర్శించారు.
అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.సభా వేదికపై ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన రైతుగీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో రైతుసంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధవలె,సారంపల్లి మల్లారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి,నంద్యాల నర్సింహారెడ్డి,సంఘం నాయకులు బుర్రి శ్రీరాములు,మల్లు లక్ష్మీ,తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.