వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.సర్వదర్శనం టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు ముందుగానే జారీ చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.
సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలో ప్రతినిత్యం 50 వేలకు పైగా టికెట్లను, ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు ప్రతిరోజు 25 వేలు ఆన్లైన్లో ఉంచుతామని తెలిపారు.
అయితే వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజులపాటు టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు.
దర్శనం టికెట్లు లేని భక్తులకు తిరుమలకు మాత్రమే అనుమతిస్తాం.వారిని దర్శనానికి మాత్రం అనుమతించే అవకాశం లేదు అని చెప్పారు.ఇక లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అవకతవకలు పాల్పడుతున్నారని ఇప్పటికే 7 మంది ఉద్యోగులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
ఇవాళ జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ పనులను ఆరు నెలలు లోపు పూర్తి చేస్తామని కూడా దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు చెప్పారు.
ఫిబ్రవరి 23వ తేదీన బాలలయం నిర్వహించి బంగారు తాపడం పనులను ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో ఎటువంటి మార్పులు ఉండవని కూడా తెలిపారు.భక్తులు సమర్పించిన బంగారం తోనే తాపడం పనులు నిర్వహిస్తామని కూడా చెప్పారు.జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.
గత సంవత్సరం తరహాలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని కూడా చెప్పారు.ఇంకా చెప్పాలంటే రేపటి నుంచి విఐపి బ్రేక్ దర్శనాలను ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రారంభిస్తామని కూడా వెల్లడించారు.
LATEST NEWS - TELUGU