నల్లగొండ జిల్లా:అన్నదాత ఇంకెన్నాళ్లు పడిగాపులు కాయలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెండెం ధనుంజయ్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఆయన మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలం భోడాంగ్ పర్తి గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఐకేపీ సెంటర్ లో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూసి చలించిన ఆయన వెంటనే అధికారులతో ఫోన్ లో మాట్లాడి రైతులు పడుతున్న ఇబ్బందులపై న్యాయం జరిగేలా చూడాలని తెలియజేశారు.అనంతరం పెండెం ధనుంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం,నెల పదిహేను రోజుల నుంచి వడ్లు కొనకుండా ఇబ్బందులు పెట్టడం,మిల్లర్లు తాలు వుందని చెప్పి బస్తాకి వడ్లు కోత కోయటంతో రైతులు మిల్లర్ల చేతిలో మోస పోతున్నారని అన్నారు.
అధికారుల నిర్లక్ష్యం వలన వడ్లు కొనకపోవడంతో నలభై అయిదు రోజుల నుంచి రైతులు ఎప్పుడూ వర్షం పడుతుందో,వడ్లు ఎక్కడ తడుస్తాయో అని చీకట్లో కూడా అక్కడే కాపలాగా ఉంటూ,బిక్కుబిక్కు మంటూ గోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇక్కడ ప్రధానంగా హమాలిల కొరత,మరియు ట్రాన్స్ పోర్టేషన్ కోసం లారీలు లేనందువలన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వడ్లు పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు,సురేష్, రవితేజ,రమేష్,విక్రమ్,శ్రీకాంత్ మరియు రైతులు పాల్గొన్నారు.