నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వం గిరిజన,ఆదివాసి ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, భవిష్యత్తు తరాలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకం.ద్వారా దేశ ప్రధానమంత్రి ఇటీవలే సంచలనాత్మక స్కీంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ స్కీం ద్వారా అటవీ,ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన తాండాల్లో,పెంటలు,చెంచుల,ఎరుకలు గూడాలలో నివసిస్తున్న గిరిజనులకు వైద్యం అందించడానికి మార్గం సుగమం చేశారు.పిఎం జన్మన్ యోజన కింద ప్రత్యేక సంచార వైద్య వాహనం వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కేటాయించారు.
ఇదే నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు,బడా నాయకులకు వరంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ స్కీం కింద ఏర్పాటు చేసిన వాహనం బాడుగ/కిరాయి పద్ధతిలో ఏర్పాటు చేసుకొని గిరిజన, ఆదివాసీ ప్రజలకు వైద్యం అందించాల్సి ఉంది.
ఇది కూడా గిరిజన,ఆదివాసీలలో చదువుకొని ఎలాంటి ఉద్యోగం,ఉపాధి లేకుండా ఉన్న యువతకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.కానీ, నల్లగొండ జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఉద్యోగస్తులు,బడా నాయకులు జన్మల్ పథకంలో సంచార వైద్య వాహనం నెలసరి అద్దె నిమిత్తం ఏర్పాటు చేసుకొని నయా దందాకు తెరలేపినట్లు తెలుస్తుంది.
వీరంతా గిరిజన,ఆదివాసీ ప్రజలకు సంచార వాహనం ద్వారా వైద్య సేవలు అందించకుండా స్వలాభం కొరకు నామమాత్రంగా వాహనాన్ని పెట్టి వైద్య సదుపాయాలు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి,పేద గిరిజనులకు,ఆదివాసీలకు అందించవలసిన వైద్య సదుపాయం అందకుండా దుర్మార్గమైన దుశ్చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులు కొల్లగొడుతున్నారని సమాచారం.ఈ విషయం వెలుగులోకి రావడంతో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ సక్రు నాయక్ తీవ్రంగా స్పందించారు.
వెంటనే విచారణ జరిపి సంబంధించిన వారిపై చర్య తీసుకుని ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబట్టి, అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పాత వాహనాన్ని రద్దు చేసి,వెంటనే కొత్త వాహనాన్ని గిరిజనుల చేత కొనుగోలు చేయించి వారికి జీవనోపాధి కల్పిస్తూ మరియు గిరిజనుల యొక్క వైద్య ఆరోగ్య పరిస్థితులను మెరుగు పరుచుటకు పునః ప్రారంభించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను,జిల్లా కలెక్టర్ ను కోరారు.