నల్లగొండ జిల్లా:చర్లగూడెం ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దని,మీకు అండగా నేనుంటానని భూ నిర్వాసితులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.శుక్రవారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం ప్రాజెక్టు వద్ద నిర్వాసితులతో కలిసి మాట్లాడారు.
నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో తెలియకుండానే ప్రాజెక్టు మొదలుపెట్టిన కేసీఆర్ తొందరపాటు చర్యల వల్ల నిర్వాసితులు రోడ్డున పడ్డారని,కుర్చీ వేసుకుని రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ పదేళ్లయిన పూర్తి చేయలేదని మండిపడ్డారు.చర్లగూడెం ప్రాజెక్టు గత ప్రభుత్వం చేసిన తొందరపాటు వల్ల భూ నిర్వాసితులు ముంపు గ్రామస్తులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా ఏదుల ప్రాజెక్టు పూర్తి అయితేనే ఇక్కడికి నీళ్లు వస్తాయని,కానీ, ఇప్పటివరకు అక్కడ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు.ఇప్పటికే ప్రభుత్వం చర్లగూడ ప్రాజెక్టు కోసం రూ.6000 కోట్లు ఖర్చు చేసిందని,ఇప్పుడు పనులు ఆపాలంటూ నిర్వాసితులు అడ్డుకున్నారని,90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టు పనులను అడ్డుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదన్నారు.నిర్వాసితులకు పునరావాసం కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇబ్రహీంపట్నంలో లేదంటే చింతపల్లి,మర్రిగూడ మండలంలో ఇప్పిస్తానని,మీకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు.