నల్లగొండ జిల్లా: విద్యార్దులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన 11 మంది ప్రభుత్వ అధ్యాపకులు ఒకేరోజు విధులకు డుమ్మా కొట్టి విందు,విలాసాల్లో మునిగితేలిన ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ విషయం తెలిసి ఎస్ఎఫ్ఐ విద్యార్ది సంఘం నాయకులు కాలేజీకి వెళ్ళి 11 మంది లెక్చరర్లు ఎక్కడికి వెళ్లారని అడగగా సెలవు పెట్టారని బుకాయించిన ప్రిన్సిపల్ అటెండెన్స్ రిజిస్టర్ చూపాలని కోరగా నీళ్ళు నమిలి చూపకుండా ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
విద్యార్ది సంఘం నేతల చెబుతున్న వివరాల ప్రకారం…కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవల పనిచేసిన ఒక లెక్చరర్ తండ్రి దశదిన కార్యక్రమానికి శుక్రవారం 11 మంది లెక్చరర్లు ఎలాంటి అనుమతి లేకుండానే విధులకు డుమ్మా కొట్టారు.కళాశాలలో మొత్తం 39 మంది లెక్చరర్లు విధులు నిర్వహిస్తుండగా 11 మంది విధులకు హాజరు కాకపోవడంతో కళాశాలకు హాజరైన విద్యార్థులు పాఠాలు చెప్పే లెక్చరర్లు లేక ఉసూరుమంటూ ఇండ్లకు తిరిగి వెళ్లిపోయారు.
విద్యార్థుల ఫిర్యాదుతో కళాశాలకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు కళాశాల ప్రిన్సిపల్ ఎంసి రాకేంద్ కుమార్ ను కలిసి లెక్చరర్ల మూకుమ్మడి డుమ్మాలపై వివరణ అడిగారు.విద్యార్థి సంఘ నాయకుల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రిన్సిపల్ రాకేంద్ కుమార్ 11 మంది లెక్చరర్లు సిఎల్ పెట్టి వెళ్లారని చెప్పారు.
ఈ మాటలను నమ్మని విద్యార్థి సంఘ నాయకులు తమకు హాజరు రిజిస్టర్ చూపించాలని కోరగా ప్రిన్సిపల్ అంగీకరించలేదు.దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘం నాయకులు విధులకు సెలవు పెట్టకుండా డుమ్మా కుట్టిన 11 మంది లెక్చరర్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ స్మారకార్ధం నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎంతో వ్యయం చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నారు.అయినా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు ఏమాత్రం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పకుండా తమ ఇష్టారీతిలో విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కళాశాల పక్కనే జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి కార్యాలయం ఉన్నా కనీసం అధికారులు తనిఖీ చేస్తారన్న భయం లేకపోవడం గమనార్హం.అధ్యాపకులు మూకుమ్మడిగా విధులకు గైర్హాజరు కావడంపై అధికారులు వాస్తవ పరిస్థితులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
శుక్రవారం 11 మంది లెక్చరర్లు విధులకు హాజరు కాకపోవడం వాస్తవమేనని,వారంతా సిఎల్ పెట్టారని కళాశాల ప్రిన్సిపల్ రాకేంద్ రెడ్డి తెలిపారు.కళాశాలలో ఒకేసారి 11 మంది లెక్చరర్లకు సీఎల్ ఎలా మంజూరు చేశారని ప్రశ్నించగా సమాధానం లేకపోవడం కొసమెరుపు