నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ అధ్యక్షుల ఇళ్లపై ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయాలపై,స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నివాసాలపై,టీఆర్ఎస్ నేతల ఇళ్లపై,వడ్ల కళ్లాల దగ్గర నల్ల జెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు.ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం,రాజ్యసభ సభ్యులు,పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఇంటిపైన నల్లజెండాల ఎగురవేశారు.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు,పార్టీ నేతలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పాలిట శనిలా మారిందని మండిపడ్డారు.కేంద్రం యాసంగి ధాన్యం కొనేవరకు నిరసన యుద్ధం ఆగేదే లేదని అన్నారు.
బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ బీజేపీ నాయకులు ఇక్కడి మాట ఇక్కడ,అక్కడి మాట అక్కడ మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని,రాష్ట్ర రైతులు బీజేపీ నేతల మాటలు విని మోసపోయారని,ఇప్పుడు రైతు కష్టాల్లో ఉంటే ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ నాయకులకు ఏ మాత్రం రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర నాయకత్వంలో మాట్లాడి రైతుల బాధలు తీర్చాలని సవాల్ విసిరారు.