నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో అత్యంత దారుణమైన అమానుష ఘటన జరిగింది.ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత అఖిల నిండు ప్రాణం గాల్లో కలిసింది.
బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన అఖిల డెలివరీ కోసం నల్లగొండ ప్రభుత్వ పెద్దాసుపత్రిలో చేరింది.
రెండు రోజులు ఆమెను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారు.శనివారం ఆమెకు పురిటినొప్పులు వస్తుంటే ప్రసవ బాధను తాళలేక బిగ్గరగా అరుస్తుండగా డెలివరీ చేసే నర్సులు ఆమె కాళ్ళను కాళ్లతో తొక్కిపట్టి,గర్భంపై చేతులతో గట్టి పైకి నెట్టి పైశాచిక ఆనందం పొందారు.
పైగా నొప్పులకు అరుస్తున్న ఆమెతో పడుకున్నప్పుడు లేదా,ఇక్కడికొచ్చి మొత్తుకుంటున్నవ్ అంటూ బూతులు తిడుతూ నర్సులు,డాక్టర్లు సభ్య సమాజం తలదించుకునేలా అమానుషంగా ప్రవర్తించారు.అయినా తమకేమీ పట్టనట్లు నర్సులు,డ్యూటీ డాక్టర్ సెల్ ఫోన్లలో బిజీ అయ్యారు.
భార్య పరిస్థితిని గమనించిన భర్త ఉన్నతాధికారులకు పరిస్థితి వివరించడంతో అధికారుల ఆదేశాలతో అప్పుడు డాక్టర్లు వచ్చి కడుపుపై గట్టిగా వత్తడంతో మగశిశువుకు జన్మనిచ్చిన అఖిల,ఆ తర్వాత తీవ్ర రక్తస్రావానికి గురైంది.పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత ఆమెను హైదరాబాద్ గాంధీకి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.దీనితో కుటుంబ సభ్యులు,బంధువులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
వారికి కాంగ్రెస్,బీజేపీ,సీపీఎం,ఇతర ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి.ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అఖిల మృతికి నూటికి నూరు శాతం ఆసుపత్రి వైద్యులు,నర్సులే కారణమని మండిపడ్డారు.ఈ ఘటనకు కారణమైన నర్సులు, వైద్యులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.