నల్లగొండ జిల్లా: రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని,కల్తీ విత్తనాలను విక్రయించి మోసాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల ప్రత్యేక అధికారి భిక్షపతి అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ధీరావత్ సైదా నాయక్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తన స్టాక్ రిజిస్టర్లు,రసీదులు,ఇన్ వాయిస్ తదితర రికార్డులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.
రైతులు కొనుగోలు చేసిన విత్తనాల రసీదులను తీసుకుని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు.బీటి-3 పత్తి విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని,ఆ విత్తనాలను విక్రయించినా, సాగు చేసినా చట్టరీత్యా నేరమని,అనుమతిలేని విత్తనాలను విక్రయించినట్లయితే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.ఫర్టిలైజర్ డీలర్లు ఎరువుల విక్రయాలను ఈపాస్ విధానంతో మాత్రమే కొనసాగించాలని,ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని,లేనిచో ఎరువుల దుకాణ యజమానులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







